కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ : మహిళలకు వరం మహాలక్ష్మి పథకం అని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం నుంచి మహిళలు ఉచిత ప్రయాణం చేసి రూ.10012.15 కోట్లు ఆదా చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సంబురాలు నిర్వహిస్తోంది. మంగళవారం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్‌లో ఆర్టీసీ వరంగల్ రీజియన్ స్థాయి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజు ఆర్టీసీ బస్సు ద్వారా ఉచిత ప్రయణం చేసి లబ్ధి పొందుతున్న ఐదుగురు మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఆర్టీసీ ఆర్‌ఎం ఎస్.భవాని ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణ సేవలు అందిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతమన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వరంగల్ డిప్యూటీ ఆర్‌ఎం (ఆపరేషన్) కేశరాజు భానుకిరణ్, వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత, సూపర్‌వైజర్లు, సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.


