కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి వినతిపై నిర్లక్ష్యం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన వినతులను ఓపికగా విన్న కలెక్టర్.. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 138 అర్జీలు అందినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణతోపాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో వేగం పెంచండి : వరంగల్ కలెక్టర్
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యల పరిష్కారానికి పారదర్శకంగా సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.


