● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● ప్రజావాణిలో 165 వినతులు
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యల పరిష్కారానికి పారదర్శకంగా సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సాంకేతికతను వినియోగిస్తూ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా నేరుగా అనుసంధానం చేసి ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా దరఖాస్తుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడే విధానాన్ని అమలు చేశారు. ప్రజావాణిలో మొత్తం 165 దరఖాస్తులు రాగా రెవెన్యూ 71, జీడబ్ల్యూఎంసీకి సంబంధించినవి 23, ఇతర శాఖలకు సంబంధించినవి 71 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ, సీఈఓ రాంరెడ్డి, ఆర్‌డీఓలు సుమా, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.
సమస్యలు ఇలా..
● నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన వి.శారద, వరంగల్ యాకుబ్‌పురాకు చెందిన అక్తర్ బేగం ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని దరఖాస్తులు అందించారు.
● రాయపర్తి మండలానికి చెందిన పి.లక్ష్మికి సర్వే నంబర్ 1522లో 21 గుంటల భూమిని కొంతమంది రికార్డులో పేర్లు మార్చారు. విచారణ చేసి పట్టా పాస్‌బుక్ అందించాలని విన్నవించారు.
● కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ని రద్దు చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్ నేతలు కోరారు.


