నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌

Mar 30 2026 7:17 AM | Updated on Mar 30 2026 7:17 AM

న్యూశాయంపేట: జిల్లాలోని కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆది వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజ లు సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కారానికి వినతులు అందించాలన్నారు.

నేడు గ్రేటర్‌లో..

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రేటర్‌ గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

నిబద్ధత కలిగిన

నాయకత్వమే ముఖ్యం

వర్ధన్నపేట: కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ఎంపిక చేయడం ఎంతో అవసరమని డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్‌ అన్నారు. ఆదివారం వర్ధన్నపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని వర్ధన్నపేట నియోజకవర్గ, మండల, డివిజన్‌ అధ్యక్షుల పదవుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి అర్హత, అనుభవం, ప్రజలతో అనుబంధం కలిగిన నాయకులు ముందుకు రావాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని పార్టీ ఎప్పటికీ మరచిపోదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాటోతు శ్రీనివాస్‌, దేవరకొండ అనిల్‌, మన్నె బాబురావు, వీసం సురేందర్‌రెడ్డి, పోరెడ్డి మహేందర్‌రెడ్డి, రఘుచందర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చాలి

నల్లబెల్లి: ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పతనం తప్పదని ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హామీలను విస్మరిస్తోందని విమర్శించారు. ఉద్యమకారులకు సంక్షేమ నిధి ఏర్పాటు, పెన్షన్‌, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ గుర్తింపుకార్డు, తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 12న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సమావేశానికి ఉద్యమకారులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉద్యమకారుల రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నందగిరి రజినీకాంత్‌, ఉపాధ్యక్షుడు ఆకుల సాంబరావు, ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలు కందికట్ల జయ, సంధ్యారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దాడులు ఖండించాలి

నర్సంపేట: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధోన్మాద దాడిని ఖండించాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్‌ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్‌ మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు చట్టాలతో దేశ సంపద మొత్తం కార్పొరేట్‌ శక్తుల చేతిలోకి వెళ్లిందన్నారు. దేశ వనరులను, దేశ సంపదను కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు గంపగుత్తగా అప్పగించే దళారీ ప్రభుత్వాలను యువత ప్రశ్నించాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత పెడదారిన పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గట్టి కృష్ణ, బండి కోటేశ్వర్లు, గంగుల దయాకర్‌, జక్కుల తిరుపతి, ప్రజా సంఘాల నాయకులు పూలక్క, గుర్రం అజయ్‌, ఇట్టబోయిన రవి, కార్తీక్‌, మర్రి మహేష్‌, సంధ్య, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement