● నేడు, రేపు నిర్వహించనున్న అధికారులు
కాళోజీ సెంటర్: జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేయడమే లక్ష్యంగా ఎఫ్‌ఎల్‌ఎస్ 2026 (ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ) కార్యక్రమాన్ని ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో 3వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో నాలుగు పాఠశాలలను ఎంపిక చేశారు. ఖిలావరంగల్ మండలం బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్, జీపీఎస్ ఈస్ట్‌ఫోర్టు స్కూల్, వరంగల్ మండలం ఇస్తామియా పబ్లిక్ స్కూల్, నల్లబెల్లి మండలం యూపీఎస్ బొల్లోనిపల్లి పాఠశాలల్లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థుల భాషా, గణితం విషయాల్లోని అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ తెలిపారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
మూడో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈనెల 30, 31 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలి.
బి.రంగయ్యనాయుడు, డీఈఓ
అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ సిద్ధం
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణలో 2026–27 సంవత్సరంలో నిర్వహించనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్‌ను రూపొందించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సారంగపాణి పేర్కొన్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ..ప్రతిభ గల అథ్లెట్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు తమ అసోసియేషన్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహిపాల్, మహిధర్, రత్నాకర్, నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, చైర్మన్ గట్టు మహేష్‌బాబు, చీఫ్ కోచ్ ఎండీ గౌస్, సభ్యులు మనోజ్, సోమశేఖర్, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఏ వర్గం వారూ సంతోషంగా లేరు
● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్
హసన్‌పర్తి: సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆరోపించారు. ఒకటో డివిజన్ సన్నాహక సమావేశాన్ని పెగడపల్లిలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. పెగడపల్లి సొసైటీకి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదని వాపోయారు. రుణమాఫీ చేయకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు నరెడ్ల శ్రీధర్, పావుశెట్టి శ్రీధర్, అటికం రవీందర్, మాజీ సర్పంచ్ నన్నబోయిన కుమార్ యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, దేవస్థాన మాజీ చైర్మన్ లక్ష్మణ్, రైతు బంధు సమితి జిల్లా మాజీ కార్యవర్గ సభ్యుడు విక్టర్‌బాబు, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జక్కు రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
●


