ఐనవోలు: మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నందనం సొసైటీ ద్వారా కొంటున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని నందనం సొసైటీ పరిధి రాంనగర్ రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతులకు మార్కెట్‌లో మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. అదేవిధంగా రాంనగర్‌లో జరుగుతున్న శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, మార్క్‌ఫెడ్ అధికారులు, సొసైటీ సీఈఓ సంపత్, రైతులు పాల్గొన్నారు.


