విద్యార్థులు పుస్తకాలను చదవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు పుస్తకాలను చదవాలి

Mar 27 2026 9:54 AM | Updated on Mar 27 2026 9:54 AM

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

చెన్నారావుపేట: విద్యార్థులు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, మంచి పుస్తకాలు చదివితే మనిషి జీవితం మారుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం ఉప్పరపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ సందర్శించారు. సర్పంచ్‌ అనిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదికే పరిమితం కాకుండా ప్రతిరోజు గ్రంథాలయానికి గంట సమయం కేటాయించాలని, ఇతిహాసాలతోపాటు మహనీయుల జీవిత చరిత్రలు చదవాలని సూచించారు. విద్యార్థులతో పాటు గ్రామస్తులు సైతం రీడింగ్‌ రూంను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి కోరారు. రీడింగ్‌ రూం వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ వద్ద కలెక్టర్‌ విద్యార్థులతో సెల్పీ దిగారు. నర్సంపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాఠశాలలకు 200 కంప్యూటర్లు అందిస్తామని తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు జయ, డీఈఓ రంగయ్యనాయుడు, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి అలివేలు, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ప్రత్యేక అధికారి డాక్టర్‌ బాలకృష్ణ, తహసీల్దార్‌ అబీద్‌అలీ, ఎంపీడీఓ ఆయేషా, ఎంఈఓ పాపమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని పీహెచ్‌సీని కలెక్టర్‌ తనిఖీ చేశారు.

గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి

గీసుకొండ: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్‌ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా దస్రు తండా గ్రామపంచాయతీ పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. టీకా కార్యక్రమం ఏప్రిల్‌ 9 వరకు కొనసాగుతుందని, పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గాలికుంటు వ్యాధిపై ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలను పంపిణీ చేశారు. జిల్లా పశువైద్య, పశుసంవర్థక అధికారి డాక్టర్‌ ఎం.బాలకృష్ణ, సర్పంచ్‌ కేలోత్‌ అమృత, స్థానిక పశువైద్య అధికారి గైని శ్రీనివాస్‌, గీసుకొండ పశువైద్యాఽధికారి డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్‌ రాధిక, సిబ్బంది చిరంజీవి, చందు, జితేందర్‌, గోపాలమిత్రలు ఇస్మాయిల్‌, రమేశ్‌, రైతులు పాల్గొన్నారు.

భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి

న్యూశాయంపేట: దేవాదుల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశపుహాల్‌లో జె.చొక్కారావు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు భూసేకరణ పురోగతిపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. నర్సంపేట, దుగ్గొండి, రాయపర్తి, వర్ధన్నపేట, నల్లబెల్లి మండలాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధం చేసి ముందస్తు నివేదికలు సమర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement