దోపిడీ దొంగలకు ఐదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగలకు ఐదేళ్ల జైలు

Mar 27 2026 9:54 AM | Updated on Mar 27 2026 9:54 AM

వరంగల్‌ లీగల్‌ : ఐదుగురు దోపిడీ దొంగలకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి గురువారం తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సిరబోయిన శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మట్ట మల్లేశం నర్సంపేటలోని ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. 2019 ఏప్రిల్‌ 18న విధులు ముగించుకొని తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ సమయంలో చింతనెక్కొండ క్రాస్‌ వరకు తన మిత్రుడి ద్విచక్ర వాహనం పై వెళ్లి అక్కడి నుంచి ఆటో కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో రంగశాయిపేటకు చెందిన శాగంటి వంశీ రావడంతో మల్లేశం తన ఆటోలో ఎక్కాడు. మరో ఆటోలో ఐనవోలు మండలం ముల్కలగూడేనికి చెందిన గువ్వల శివ, దోమల రాజు, హసన్‌పర్తి మండల మడిపల్లికి చెందిన హరిక శ్రీవర్ధన్‌, ఖిలా వరంగల్‌ మండలం నక్కలపల్లికి చెందిన ఎర్ర కార్తీక్‌.. వంశీ ఆటోను వెంబడించారు. ఈ రెండు ఆటోలు పర్వతగిరి శివారులోని చెరువు వద్ద ఆగాయి. అందరూ మూకుమ్మడిగా మల్లేశంపై దాడి చేసి అతడి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. ఈ విషయంపై బాధితుడు మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పర్వతగిరి పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో నేరస్తులు ఐదుగురికి జడ్జి అపర్ణాదేవి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. సాక్షులను కోర్టులో కానిస్టేబుల్‌ సింగరబోయిన రాజు హాజరుపర్చారు.

యువతిని మోసం చేసిన

నేరస్తుడికి పదేళ్లు..

వరంగల్‌ లీగల్‌ : ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో నేరం రుజువుకావడంతో చెన్నారావుపేట మండలం జోజిపేటకు చెందిన నెలకంటి జోసెఫ్‌ తంబికి పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ వరంగల్‌ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి జి.ప్రేమలతారెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బి.వెంకట్‌రామ్‌నాయక్‌ కథనం ప్రకారం.. ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామానికి చెందిన ఓ యువతి నర్సంపేటలోని సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన సోదరి ఊరైన చెన్నారావుపేట మండలం జోజిపేట గ్రామానికి వెళ్లిన వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన జోసెఫ్‌ తంబితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లు కొనసాగిన వారి స్నేహం ఆసరా చేసుకొని తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన జోసెఫ్‌ తంబి పలుమార్లు యువతిని లోబర్చుకున్నాడు. అనంతరం సదరు యువతి వివాహ విషయమై పలుమార్లు అడగగా జోసెఫ్‌ తంబి ఏదో కారణం చెబుతూ వాయిదా వేసేవాడు. చివరకు 2 జనవరి 2022న యువతి తల్లిదండ్రులతో సహా జోసెఫ్‌ తంబి ఇంటికెళ్లి పెళ్లి విషయమై మాట్లాడారు. దీనికి తంబి తల్లిదండ్రులు, కుటుంబీకులు అభ్యంతరం తెలిపి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. పెద్దల సమక్షంలో మాట్లాడినా ఎలాంటి మార్పు లేదు. దీంతో చివరికి 6 ఫిబ్రవరి 2022న ఖానాపురం పీఎస్‌లో సదరు యువతి ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువు కావడంతో నేరస్తుడు జోసెఫ్‌ తంబికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జడ్జి ప్రేమలతారెడ్డి తీర్పు వెలువరించారు. కేసును పోలీసు అధికారులు ఎం.సాయిరమణ, కె.సూర్యప్రసాద్‌ పరిశోధించారు. లైజన్‌ ఆఫీసర్‌ దేవరకొండ వెంకటేశ్వర్లు, భరోసా న్యాయ అధికారి నీరజ పర్యవేక్షణలో కానిస్టేబుల్‌ నమిండ్ల మహేశ్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement