● గిర్నిబావిలో విషాదఛాయలు
దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో పాడిరైతు మృతి చెందిన సంఘటన మండలంలోని గిర్నిబావిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎండీ యాకూబ్‌పాషా (56) రెండు పాడిగేదెలతో జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం పాలను తీసుకుని గిర్నిబావిలోని పలువురి ఇళ్ల వద్దకు వెళ్లి ఇచ్చి మోపెడ్ వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న కారు శాలివాహన వీధి సమీపంలో వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కిందపడిన యాకూబ్‌పాషా తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య కై రూన్‌బీ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అందరితో కలిసి మెలిసి ఉండే యాకూబ్‌పాషా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తరచూ ప్రమాదాలు..
గిర్నిబావిలో వరంగల్– నర్సంపేట ప్రధాన రహదారిపై శాలివాహన వీధి సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాదికి నాలుగు నుంచి ఐదు రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. గతేడాది చెల్పూరి మల్లయ్య రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొని మృతి చెందాడు. ఇప్పుడు అదే స్థలంలో యాకూబ్‌పాషా మృతి చెందాడు. గిర్నిబావి ప్రధాన రహదారిపై వేగాన్ని నియంత్రించడానికి వరంగల్, నర్సంపేట వైపు రెండు వైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. దీనికి తోడు షాపుల వారు రోడ్డును ఆక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు పరిపాటిగా మారుతున్నాయి.


