● అసెంబ్లీ సమావేశాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: ఆకేరువాగు సమీప పొలాల్లో ఇసుక తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఆకేరు వాగు వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల మీదుగా ప్రవహిస్తూ మహబూబాబాద్ నుంచి గోదావరిలో కలుస్తుందని వివరించారు. ఈ వాగు సమీప పొలాల్లో మేట వేసిన మట్టిని ఫిల్టర్ చేయగా వచ్చే ఇసుకను నిర్మాణాలకు ఉపయోగిస్తారని చెప్పారు. ఇసుక విక్రయాలు ఆగిపోవడంతో ఈ మూడు మండలాలకు చెందిన ఐదువేల కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. ఒక్క ట్రాక్టర్ ఇసుక విక్రయిస్తే వారికి ఒక వెయ్యి రూపాయలు వస్తాయన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన ఇసుక పాలసీతో దళారులు, మాఫియాకు మింగుడు పడడం లేదన్నారు. ఆకేరు వాగు పరీవాహక ప్రాంతాల్లో ఆయా గ్రామ పంచాయతీలకు రాయల్టీ చెల్లించే విధంగా ఏర్పాటు చేస్తే గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరడంతోపాటు బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందన్నారు. ఇసుక తీసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.


