వరంగల్ కలెక్టర్ సత్యశారద
కాశిబుగ్గ: రోగుల వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న ఆహారం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, పౌష్టికాహారం సమయానికి అందేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత, ఔషధాల లభ్యత, నాణ్యమైన వైద్యసేవల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆర్డీఓ ఉమారాణి, జిల్లా వెనుకబడిన వర్గాల అభివృద్ధి అధికారి పుష్పలత, సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ పనులను పూర్తి చేయాలి
న్యూశాయంపేట: ఉపాధి హామీ పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశహాల్‌లో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి వాటిని త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పనుల పూర్తి వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీవాణి, పీఆర్ ఇంజనీర్ ఇజ్జగిరి, డీపీఓ కల్పన, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.


