ఆదాయం అదరహో.. | - | Sakshi
Sakshi News home page

ఆదాయం అదరహో..

Mar 25 2026 7:51 AM | Updated on Mar 25 2026 7:51 AM

ఖానాపురం: మునగ సాగు రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని గడించవచ్చని నిరూపిస్తున్నారు రైతులు. మునగకాయలకు మార్కెట్‌లో ధరలు సైతం అధికంగానే ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత పంటల సాగులో జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. రైతులు ఎక్కువగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. జిల్లాలో వరి, మక్కజొన్న, పత్తి, మిర్చితో పాటు కూరగాయల పంటలను సైతం అధికంగానే సాగు చేస్తుంటారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలో 112 ఎకరాల్లో రైతులు మునగకాయ పంటలను సాగు చేస్తున్నారు. ఒక ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు పెట్టుబడి అవుతుంది. 3.5 నుంచి 1.5 మీటర్ల దూరంతో మునగ మొక్కలు నాటుకున్నారు. ప్రధానంగా మునగ రెండు సంవత్సరాల కాలపు పంట. 6 నెలల నుంచి 8 నెలల కాలపరిమితిలో మొదటి దఫా దిగుబడి వస్తుంది. ఆ తర్వాత మూడు ఫీట్ల వరకు కొమ్మలను కత్తిరించుకోవాలి. దీంతో సైడ్‌ కొమ్మలు వచ్చి రెండో దశ దిగుబడి మూడు నెలల వ్యవధిలోనే వస్తుంది. మొదటి దశ కంటే రెండో దశలోనే దిగుబడి అధిక మొత్తంలో వస్తుంది. సాగులో రైతులు డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. డ్రిప్‌ విధానం ద్వారా పంటలకు కావాల్సిన నీరు, ఎరువులు, రసాయనాలను నేరుగా మొక్కలకే అందుతుంది. మునగలో రైతులు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను గడిస్తున్నారు. రెండు సంవత్సరాల తర్వాత పంటను తొలగించాల్సి ఉంటుంది.

రైతులకు సిరులు కురిపిస్తున్న మునగసాగు

ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి..

రూ.లక్ష వరకు రాబడి

జిల్లాలో 112 ఎకరాల్లో పంటసాగు

మునగసాగు ఎకరాల్లో..

మండలం సాగు

చెన్నారావుపేట 10

నెక్కొండ 5

ఖానాపురం 2

నర్సంపేట 15

నల్లబెల్లి 5

దుగ్గొండి 20

వర్ధన్నపేట 5

పర్వతగిరి 10

రాయపర్తి 5

సంగెం 10

గీసుకొండ 25

మొత్తం 112

ఎకరంలో రూ.లక్ష ఆదాయం

నాకున్న ఎకరం భూమిలో మునగ పంటను సాగు చేశా. జూలై నెలలో పంట వేయగా డిసెంబర్‌ మొదటి వారంలో దిగుబడి వచ్చింది. మరోసారి జూన్‌లో కత్తిరింపు (ఫూనింగ్‌) చేపట్టాను. సెప్టెంబర్‌లో రెండోసారి దిగుబడి వచ్చింది. రెండు సంవత్సరాల వ్యవధిలో లక్ష రూపాయల ఆదాయాన్ని పొందాను. మునగ పంటలో అంతర పంటగా కూరగాయలను సైతం సాగు చేసుకున్నాను. కూరగాయల సాగుతో రూ.1,60,000 ఆదాయం వచ్చింది. డ్రిప్‌ విధానంతో స్థిరమైన ఉత్పత్తి సాధ్యమైంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చింది.

– సత్తూర్‌ అజయ్‌, చంద్రుగొండ,

నెక్కొండ మండలం

ఆధునిక పద్ధతులతో లాభాలు

రైతులు ఆధునిక పద్దతులు అవలంబిస్తే అధిక లాభాలు పొందవచ్చు. ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సాగు కోసం రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీలు, పథకాలు ఇస్తోంది. మునగ సాగులో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం.

– తరుణ్‌, ఉద్యానశాఖ అధికారి,

ఖానాపురం

మార్కెట్‌లో మునగకు మంచి ధరలు

మునగకాయలకు మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తున్నాయి. రైతులు వ్యాపారులకు కిలో రూ.70 నుంచి రూ.150 విక్రయిస్తున్నారు. ఆ తర్వాత మార్కెట్‌లో వ్యాపారులు ప్రజలకు రూ.50కి నాలుగు కాయల చొప్పున విక్రయిస్తున్నారు. గత నెలలో రైతులు కిలో రూ.150 వరకు విక్రయించడంతో మార్కెట్‌లో మునగకాయల ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వ్యాపారులకు రైతులు రూ.70కి పైగా విక్రయిస్తున్నారు. వీటితో పాటు రైతులు మునగసాగులో అంతరపంటగా కూరగాయల సాగు సైతం చేసుకొని లాభాలు పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement