వరంగల్ లీగల్: రాజీమార్గమే రాజమార్గమని.. రాజీ కుదుర్చుకోదగిన కేసులు పరిష్కరించుకుని ప్రశాంతంగా జీవించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, జీఎల్ శ్రీదేవి అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు ఈనెల 28న (శనివారం) వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టులతో పాటు నర్సంపేట, పరకాల కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, పోలీసు, రెవెన్యూ అధికారులతో, వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు, ఇన్సూరెన్స్ సంబంధ, చిట్ ఫండ్ కంపెనీ, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్, వివాహ/కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్, బ్యాంకు, చిట్ ఫండ్, ఎక్సైజ్ కేసులు, ఎలక్ట్రిసిటీ సంబంధ కేసులతో పాటు రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కోర్టుల్లో లేని కేసులను ప్రీ–లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని కోరారు. న్యాయవాదులు, చిట్‌ఫండ్, బ్యాంకు ఇన్సూరెన్స్ అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శులు ఎం.సాయికుమార్, జి.రామలింగం, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో 11 బెంచ్‌లు
జిల్లాలో లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించేందుకు వరంగల్ కోర్టులో 9, నర్సంపేట కోర్టులో 2 బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో గుర్తించబడిన కేసుల్లో మొత్తం 1,056 రాజీపడదగు పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లాలో 10 బెంచ్‌లు
లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించేందుకు హనుమకొండ కోర్టులో 8, పరకాల కోర్టులో 2 బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే, జిల్లాలో లోక్ అదాలత్‌లో గుర్తించబడిన కేసుల్లో మొత్తం 751 రాజీపడదగు పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి వివరించారు.
28న లోక్ అదాలత్.. సద్వినియోగం చేసుకోవాలి
న్యాయమూర్తులు వీబీ నిర్మలాగీతాంబ, జీఎల్ శ్రీదేవి


