గీసుకొండ: రైతులు సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగుచేసి నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయవచ్చని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కొనాయమాకుల రైతువేదికలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ తక్కువ మోతాదులో రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తూ అధునాతన సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేయాలన్నారు. అనంతరం ఉద్యాన పథకం కింద రైతులకు కూరగాయల విత్తనాల మినీకిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ అధికారి బాలకృష్ణ, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, మండల ఉద్యానశాఖ అధికారి తిరుపతి, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, మండల ఉద్యాన విస్తరణ అధికారి వేణు, సర్పంచ్ వజ్ర రాజు, రైతులు రహీం, పోలీస్ శంకర్‌రావు, రాజేశ్వరరావు పాల్గొన్నారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
పర్వతగిరి: సైబర్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పీఎంశ్రీ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ కళాశాల, పాఠశాలలో మంగళవారం బాలల భద్రత, సైబర్ క్రైంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైం అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో జాగ్రత్తలు పాటించాలని, అపరిచితులతో సంభాషణకు దూరంగా ఉండాలని కోరారు. సైబర్ క్రైం హెల్ప్ లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను వినియోగించుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీబీసీడీఓ పుష్పలత, డీఎసీసీడీఓ భాగ్యలక్ష్మి, డీటీడబ్ల్యూఓ నారాయణరెడ్డి, డీఎండబ్ల్యూఓ రమేశ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ విజయకుమార్, ఏఎస్సీ వేణుగోపాల్, ఎంపీడీఓ శంకర్‌నాయక్, పర్వతగిరి సర్పంచ్ చీదురు శంకర్, సీఐ రాజగోపాల్, ఎస్సై బి.ప్రవీణ్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాలను
సద్వినియోగం చేసుకోవాలి
న్యూశాయంపేట: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి పెట్రోల్‌బంకు కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)అధ్వర్యంలో ఆర్థిక సాధికారతకు ఇందిరా మహిళాశక్తి వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. పెట్రోల్ బంకుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని కోరారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ఎల్‌డీఎం రాజు, మెప్మా పీడీలు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


