కాళోజీ సెంటర్: విద్యారంగానికి బడ్జెట్‌లో రూ.26,674 కోట్లను కేటాయించి ప్రభుత్వం తీవ్ర నిరాశకు గురిచేసిందని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి విమర్శించారు. కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ సంధ్యారాణికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని 1965లో కొఠారి కమిషన్ సూచించిందని, తెలంగాణ విద్య కమిషన్ సైతం 18 శాతం నిధులను కేటాయించాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్ టీఏలు, పెన్షనర్ల బెనిఫిట్స్, డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. టీపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి మనోజ్, జిల్లా కార్యదర్శి సురేశ్‌బాబు, నాయకులు బెల్లంకొండ పూర్ణచందర్, మనుపాటి వెంకటేశ్వర్లు, కడారి భోగేశ్వర్, బెల్లంకొండ రమేశ్, కుమారస్వామి, సోమేశ్వర్, బైరి స్వామి, రిటైర్డ్ ఉపాధ్యాయుల బకాయిల సాధన సమితి జిల్లా బాధ్యులు కందుకూరి దేవదాస్, గఫార్ తదితరులు పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి


