టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నన్నెబోయిన తిరుపతి
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం పెంచాలని, విద్యారంగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ యూనియన్ జిల్లాశాఖ అధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యారంగానికి ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన 8.22 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతులు, కంప్యూటర్లు, గ్రంథాలయాలు, ఉపాధ్యాయుల నియామకం, ప్రీ–ప్రైమరీ తరగతుల ప్రారంభం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. 2023 జూలైతో ముగిసిన పీఆర్‌సీ గడువు 33 నెలలు దాటినా, కొత్త పీఆర్‌సీపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడాన్ని ఖండించారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలకు నిధులు కేటాయించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024 మార్చి తర్వాత రిటైరైన ఉద్యోగుల ప్రయోజనాల చెల్లింపుల్లో జాప్యం వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని విడుదల చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బత్తిని శ్రీమాంజనేయులు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించి మినిమం టైమ్ స్కేలు వర్తింపజేయాలని, సమ్మె కాలపు జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గిరిజన, ఆశ్రమ రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులకు డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


