ఉపకారికి ఆపద ! | - | Sakshi
Sakshi News home page

ఉపకారికి ఆపద !

Mar 23 2026 10:01 AM | Updated on Mar 23 2026 10:01 AM

పని ఒత్తిడి.. ఉద్యోగుల కొరత

హన్మకొండ అర్బన్‌: ఆపదలో ఆదుకునే అత్యవసర సేవకులకు కష్టమొచ్చింది. ఏడు నెలలుగా సిబ్బందికి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. కుయ్‌.. కుయ్‌..మంటూ ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలిస్తూ ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్న అత్యవసర సేవల ఉద్యోగులకు వేతనాలకు ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేయట్లేదు, సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108, 102 అంబులెన్స్‌ సిబ్బంది గతేడాది ఆగస్టు నుంచి 2026, ఫిబ్రవరి వరకు సుమారు ఏడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేయకపోవడంతో వేతనాలు నిలిచిపోయాయని, వెంటనే బడ్జెట్‌ విడుదల చేసి పెండింగ్‌ జీతాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సేవలు

తెలంగాణలో సుమారు 625 వరకు 108 అంబులెన్స్‌ వాహనాలు పనిచేస్తుండగా, వాటిలో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్లు (ఈఎంటీ), పైలట్లు, సపోర్ట్‌ సిబ్బంది కలిపి దాదాపు 3,000 మంది సేవలందిస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు సేవలందించే 102 అంబులెన్స్‌ వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 185 ఉన్నాయి. వీటిలో సుమారు 250 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.

పార్థివ వాహన సేవలకు ఇబ్బందులు

ఆస్పత్రుల్లో మరణించిన వ్యక్తుల పార్థివ దేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఉపయోగించే పార్థివ వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 ఉన్నాయి. వీటిలో దాదాపు 180 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. జీతాలు అందక ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుమారు 70 వరకు 108 అంబులెన్స్‌ వాహనాలు, 10 వరకు 102 అంబులెన్స్‌ వాహనాలు, అదేవిధంగా 4 పార్థివ వాహనాలు పని చేస్తున్నాయి. వీటిలో సుమారు 320 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే వైద్య సేవలు అందించేందుకు వీరు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.

నిర్వహణ భారం..

బడ్జెట్‌ విడుదల అవ్వకపోవడంతో అంబులెన్‌్స్‌ వాహనాల నిర్వహణ కష్టంగా మారింది. ప్రతీ రోజు డీజిల్‌ ఖర్చులు, వాహనాల మరమ్మతులు, అంబులెన్‌్స్‌లలో అవసరమైన మందులు సమకూర్చడం వంటి అంశాల్లో వ్యయభారం పెరిగిందని సిబ్బంది చెబుతున్నారు. దీంతో అత్యవసర సేవలను నిరంతరాయంగా కొనసాగించడం కూడా సవాల్‌గా మారిందని వారు పేర్కొంటున్నారు.

సకాలంలో వేతనాలు అందకపోవడంతో పాటు పని ఒత్తిడి అధికమవుతుండడంతో ఈ రంగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు క్రమంగా విధులు వదులుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారం, నిరంతర పని ఒత్తిడి వంటి కారణాలతో ఉద్యోగులు ఈ రంగంలో కొనసాగేందుకు నిరాసక్తత చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల అంబులెన్స్‌ సేవల్లో ఉద్యోగుల కొరత కూడా పెరుగుతోందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బడ్జెట్‌ విడుదల చేయాలని, పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని 108, 102, పార్థివ వాహనాల సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. పని ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకుని సకాలంలో జీతాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

108, 102 అంబులెన్స్‌ సిబ్బందికి 7 నెలల జీతాలు బకాయి

బడ్జెట్‌ విడుదల చేయాలని వినతి

అసలే పనిభారం.. ఆపై వేతనాలు లేవు

డీజిల్‌... మరమ్మతులకు నిధులు కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement