● జల్ మహోత్సవంలో మంత్రి సీతక్క
ఆత్మకూరు: సహజవనరులే జీవనాధారమని, సహజవనరుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుమలగిరిలో జల్ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో 12,706 గ్రామాల్లో మిషన్ భగీరథ జలాలు వస్తున్నాయని, ఈవిషయమై ఇప్పటికే 12,405 మంది సర్పంచ్‌లతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన నీటిని తాగుతూ రోగాలు కొని తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఆధునికత పేరుతో రోగాలు కొని తెచ్చుకుంటున్నారని, పూర్వపు ఆచారాలు పాటించాలని కోరారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అంగన్‌వాడీ సెంటర్లలో పాలు అందజేశామని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలు అందించనున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పపువ్వుతో ఆరోగ్యకరమైన వంటలు చేసేవారని గుర్తు చేశారు. మేడారంలో మహిళలు స్వయం ఉపాధితో రూ.కోట్ల లాభం పొందారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్‌ఓ ప్లాంట్లకు దూరంగా ఉండాలని కోరారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ మిషన్‌భగీరథ నీటిని సద్వినియోగం చేసుకోవాలని, నీటిని వృథాచేయొద్దని సూచించారు. సర్పంచ్ బూర దేవేంద్రకు హర్‌ఘర్‌జల్ ప్రశంసపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ నారాయణ, మిషన్ భగీరథ ఈఈ గాయత్రి, డీఈ మధు, ఏఈ రంజిత్, తహసీల్దార్ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు పర్వతగిరి మహేశ్వరిరాజు, ముద్దం సాంబయ్య, ఎల్కటి రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కమలాపురం రమేశ్, నాయకులు బీరం సుధాకర్‌రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ ఏరుకొండ రవిందర్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు కక్కెర్ల రాజు, మార్క రజనీకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు పాల్గొన్నారు. కాగా, జల్ మహోత్సవ్‌కు ఆత్మకూరు మండల వాస్తవ్యుడు, డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఆహ్వానం లేనందునే కార్యక్రమానికి రాలేకపోయానని తన సన్నిహితులకు ఆయన చెప్పినట్లు సమాచారం.


