● వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
ధర్మసాగర్: వైద్యం వ్యాపారం కాదు.. మానవసేవ అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో కూరపాటి ఫౌండేషన్ సహకారంతో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు ఎంపీ స్వయంగా పలు వైద్యపరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ కూరపాటి ఫౌండేషన్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మండలాల వారీగా వైద్యశిబిరాలు నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం 30–40 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన తర్వాత కనిపించే ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తక్కువ వయసులోనే వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ఉప సర్పంచ్ కొమురమ్మ, సాయిపేట సర్పంచ్ ఆడాలి లక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, కూరపాటి ట్రస్ట్ చైర్మన్ కూరపాటి రమేశ్, డాక్టర్ సుష్మిత తదితరులు పాల్గొన్నారు.


