యాప్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో యూరియా యాప్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. యాప్ నిర్వహణలో వ్యవసాయ శాఖ, ఎరువుల డీలర్ల పాత్రను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని టైప్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సొంత భూమిలో సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, తదితర రైతులు తమ సెల్‌ఫోన్, ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అయి యాసింగి–2025–26లో సాగు చేయనున్న పంట వివరాలను నమోదు చేయాలి. పంట వివరాలు నమోదు చేసిన అనంతరం జిల్లాలోని ఎరువుల డీలర్ల వద్ద జాబితా, వారి వద్ద అందుబాటులో ఉన్న యూరియా బస్తాల వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. సాగుకు అవసరమైన యూరియాను దఫాల వారీగా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. యూరియా బుకింగ్ అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడీనంబర్ వస్తుందని, ఆ ఐడీ నంబర్‌తో పాటు ఆధార్, పట్టాదారు పాస్‌బుక్ తీసుకుని సమీప డీలర్ వద్ద యూరియా పొందవచ్చన్నారు. అయితే యూరియా స్లాట్ బుకింగ్‌కు సంబంధించి బుకింగ్ ఐడీ కేవలం 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు.యాప్ ద్వారా యూరియా స్లాట్ బుకింగ్ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


