ఆరంభంలోనే అవస్థలు
కమలాపూర్: యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా తిప్పలు మొదలయ్యాయి. యూరియా వచ్చిందని తెలియగానే రైతులు పనులన్నీ వదులుకుని గంటల తరబడి క్యూ కడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులు తొలగించడానికి యాప్‌ను ప్రవేశపెట్టినప్పటికీ అది పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి రాలేదు. దీంతో కమలాపూర్ పీఏసీఎస్‌కు ఇటీవల నాలుగు లారీల్లో 1,776 బస్తాల యూరియా రాగా, వాటిని మంగళవారం కొందరు రైతులకు పంపిణీ చేశారు. పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో బుధవారం ఉదయం 6:30 గంటల నుంచే మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పీఏసీఎస్ వద్ద బారులుదీరారు. మరి కొందరు రైతులు క్యూలైన్‌లో చెప్పులు ఉంచారు. యూరియా పంపిణీ సమయంలో ఒక్కో రైతుకు 3 బస్తాల చొప్పున పంపిణీ చేస్తుండగా, మంగళవారం ఒక్కో రైతుకు 5 బస్తాల చొప్పున పంపిణీ చేసి ఇప్పుడు తమకు 3 బస్తాలే ఎందుకు పంపిణీ చేస్తున్నారంటూ రైతులు పీఏసీఎస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడకు వెళ్లి రైతులకు నచ్చజెప్పారు. పోలీసు పహారాలో రైతులకు యూరియా పంపిణీ చేయించారు. అయినప్పటికీ పలువురు రైతులు యూరియా బస్తాలు దొరక్క నిరాశతో వెనుదిగిరి వెళ్లిపోయారు. యాసంగి సీజన్ ఆరంభంలోనే యూరియా బస్తాల కోసం వ్యవసాయ పనులన్నీ వదులుకుని కుటుంబ సమేతంగా క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోందని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా నేరుగా గ్రామాలకే సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఏఓ వేణు మాట్లాడుతూ.. మండలంలో యాసంగి పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. మరో రెండు రోజుల్లో మరింత స్టాక్ రానుందని, రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు.
యాసంగిలో రైతులకు తప్పని యూరియా తిప్పలు
పోలీస్ పహారాలో పంపిణీ


