ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి
● డీఎంహెచ్‌ఓ అప్పయ్య
● పీహెచ్‌సీ తనిఖీ
శాయంపేట: ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది చూడాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. టీబీ ముక్త్ భారత్, ఎన్ సీడీ కార్యక్రమాలపై వైద్యులకు, ఏఎన్‌ఎంలకు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. మండలంలో మగవారి కంటే ఆడవారి జననాల రేటు తక్కువగా ఉందని పెరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. గర్భిణులు నార్మల్ ప్రసవాలు జరిగేలా చూస్తూ ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగేలా చూడాలన్నారు. సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని, సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అప్పయ్య హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.


