వేగంగా ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, వరంగల్: ఇన్నాళ్లు పంచాయతీ ఎన్నికల కోలాహలమున్నా.. ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా ఆ టంకం లేకుండా యథావిధిగానే సాగింది. ఎన్నిక ల ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తీరిక దొరికిన సమయాల్లో తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించారు. ఈనెల ఒకటి నుంచి ఇప్పటివరకు వేల మెట్రిక్ టన్నులు అధికారులు కొనుగోలు చేశారు. ఇందుకు తగ్గట్టుగానే పౌర సరఫరా విభాగాధికారు ల ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఇబ్బంది కలగకుండా దొడ్డు, సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి సమీప ప్రాంతాల్లోని మిల్లులకు తరలించారు. ఇలా జిల్లాలోని 251 కేంద్రాల్లోని నిర్వాహకులు ఇప్పటివరకు 1,16,578. 560 మెట్రిక్ టన్నులు సేకరించి ఆయా ప్రాంతాల్లోని 93 మిల్లులకు తరలించారు. వీటికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 170 లారీల్లో లోడ్‌లు చేసి ఆయా మిల్లులకు తరలించే ప్రక్రియ సాగింది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, గీసుకొండ, పర్వతగిరి మండలాల్లో ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తి కావొచ్చింది. అయితే నర్సంపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వరి కోతలు ఇప్పుడిప్పుడే పూర్తయ్యాయి. జనవరి రెండో వారంనాటికి ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తికావొచ్చని అధికారులు అంటున్నారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ.2,389లతో పాటు రూ.500ల బోనస్, దొడ్డు ధాన్యానికి గ్రేడ్–ఏ క్వింటాకు రూ.2,389, కామన్ క్వింటాకు రూ.2,369 చెల్లిస్తోంది.
రోజుల వ్యవధిలో డబ్బుల జమ
జిల్లాలో ఇప్పటివరకు అధికారులు 1,16,578.560 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇందుకు సంబంధించిన డబ్బును రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు. అలాగే ఈ నెల 20న సన్న రకాలు సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధరకి అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.649.84 కోట్ల నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నగదు బదిలీ ప్రక్రియ ప్రా రంభమైందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్ధేశించిన 33 రకాల సన్న ధాన్యంరకాలను సాగు చేసి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుంది. ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను పరిశీలించి, నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగ దు జమ చేస్తారు. కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ధాన్యం డబ్బులు జమచేసే సమయంలోనే ఈ బోనస్ డబ్బులు చెల్లించేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముందుకు వెళ్తున్నారు. కొందరు రైతులు తమ బ్యాంక్ ఖాతా కు ఆధార్ లింక్ చేసుకోకపోవడంతో వారి ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కావడం లేదని తెలుస్తోంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్‌లోని ‘ఫార్మర్ కార్నర్’ ద్వారా రైతులు ఫిర్యాదు నమోదు చేయవచ్చు. లేదంటే మండల వ్యవసాయ అధికారి, కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
జిల్లాలో ధాన్యం
కొనుగోలు కేంద్రాలు: 251
సేకరించాల్సిన లక్ష్యం:
2,50,000
మెట్రిక్ టన్నులు
ఇప్పటివరకు
సేకరించింది:
1,16,578
మెట్రిక్ టన్నులు
రైతుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము:
రూ.223.81 కోట్లు
ఇంకా చెల్లించాల్సింది:
రూ.54.682 కోట్లు
పంచాయతీ ఎన్నికల సమయంలోనూ వేల మెట్రిక్ టన్నుల సేకరణ
ఇప్పటివరకు కొనుగోలు చేసింది 1,16,578 మెట్రిక్ టన్నులు
సేకరించాల్సిన లక్ష్యం 2,50,000 మెట్రిక్ టన్నులు
జనవరి రెండోవారం నాటికి
కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం
‘మోంథా’ తుపాను ప్రభావం చూపిందా?
ఈ ఏడాది 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా పౌర సరఫరా విభాగాధికారులు లక్ష్యం నిర్ధేశించుకున్నారు. అయితే దొడ్డు వడ్లు 30,000, సన్న వడ్లు 2,20,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందని అంచనా వేశారు. ఇందుకు భిన్నంగా ఇప్పటివరకు దొడ్డు ధాన్యం 1881.840 మెట్రిక్ టన్నులు, సన్నవి 1,14,696.720 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. జనవరి 2వ తేదీ వరకు ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందనుకున్నా.. కేవలం నర్సంపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో మాత్రమే ఇంకా వరి ధాన్యం రావాల్సి ఉందని అధికారులంటున్నారు. ఈ లెక్కన ఇప్పటివరకు 1,50,000 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంటే దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఎటువైపు వెళ్లినట్టని, లేదా రైతులు అవసరాలకు ముందే దళారులకు అమ్ముకున్నారా అన్న చర్చ ఉంది. అదే సమయంలో ఈ ఏడాది మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో 19,728 ఎకరాల్లో పంట నష్టం జరిగితే, వరినే అధికస్థాయిలో నష్టం జరిగిందని సర్వేలో అధికారులు తేల్చారు. అందుకే అనుకున్న లక్ష్యం 2,50,000 మెట్రిక్ టన్నులు రాకపోవచ్చని అధికారులు అంటున్నారు.


