సంగ్రామం
నేడే రెండో దశ
సాక్షి, వరంగల్:
జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామానికి వేళయ్యింది. ఈ మేరకు దుగ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం మండలాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి 1,008 పోలింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులు శనివారం సాయంత్రం తీసుకెళ్లారు. దుగ్గొండి మండలంలో 282, గీసుకొండ మండలంలో 188, నల్లబెల్లి మండలంలో 252, సంగెం మండలంలో 286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 1,39,100 మంది ఓట్లు ఉంటే 85 శాతంపైనే పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్ సత్యశారద శనివారం గీసుకొండ, సంగెం, నల్లబెల్లి, దుగ్గొండి మండల కేంద్రాల్లోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆసక్తి రేపుతున్న ఆ గ్రామాలు..
● మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్వగ్రామం గీసుకొండ మండలం వంచనగిరిలో పంచాయతీ పోరు ఆసక్తి రేపుతోంది. కొండా వర్గం నుంచి కొమ్ముల కమల, పరకాల ఎమ్మెల్యే రేవూరి వర్గం నుంచి కొమ్ముల రాజమణి సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ 3,015 ఓట్లు ఉన్నాయి. అలాగే, గీసుకొండ మేజర్ గ్రామ పంచాయతీ బరిలో ఉన్న వీరగోని రాజ్‌కుమార్, కొమురారెడ్డి ఎవరు గెలుస్తారోనన్న హైటెన్షన్ నెలకొంది.
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సొంతూరు దుగ్గొండి మండలంలోని కేశవపురంలో 495 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి బదరగాని రమ, బీఆర్‌ఎస్ నుంచి వైనాల లక్ష్మి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
● నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సొంతూరు నల్లబెల్లి మేజర్ గ్రామ పంచాయతీలో 3,772 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ మహిళ రిజర్వ్ అయిన ఈ స్థానం నుంచి కాంగ్రెస్ బలపరిచిన పరికి సుజాత, బీఆర్‌ఎస్ బలపరిచిన నాగిని జ్యోతి తలపడుతున్నారు.
● ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క బావ బిడ్డ వాసం తిరుపతమ్మ పోటీచేస్తున్న నల్లబెల్లి మండలం గోవిందాపురంలో 986 ఓట్లు ఉన్నాయి. బీఆర్‌ఎస్ నుంచి పాడ్య రజిత పోటీ చేస్తున్నారు. సీతక్క పర్యటించి తిరుపతమ్మను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు.
వంజరపల్లిలో విచిత్ర పరిస్థితి..
సంగెం మండలం పెద్ద తండా, గాంధీనగర్ గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వంజారపల్లి ఎస్టీ రిజర్వ్ అయ్యింది. ఆ జనాభా లేకపోవడంతో ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. మూడు వార్డులు కూడా ఎస్టీ రిజర్వ్ కావడంతో వాటికి ఎన్నికలు లేవు. ఆశాలపల్లిలో ఎస్సీలు లేక రెండు వార్డులకు నామినేషన్లు పడలేదు. అంతటా ఎన్నికల కోలాహలం ఉంటే వంజరపల్లిలో మాత్రం సర్పంచ్ అభ్యర్థి లేకపోవడంతో విచిత్ర పరిస్థితి నెలకొంది.
ప్రలోభాల పర్వం..
ఎన్నికల్లో ఎలాగైనా గలవాలని అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఇన్నాళ్లు ఓటర్లను ఇంటిఇంటికి వెళ్లి కలిసిన కొందరు నోట్లు, మద్యం సరఫరా చేశారు. చికెన్, మటన్ కూడా అరకిలో, కిలో లెక్కన కొన్నిచోట్ల పంపిణీ చేశారు. కొందరైతే ఆయా కుల సంఘాలకు భూమి, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తామంటూ హామీనిచ్చారు. వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అభయమిచ్చారు. వలస ఓటర్లను సొంతూళ్లకు రప్పించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ పంచాయతీ ఎన్నికల్లో రూ.5,90,000 నగదు, రూ.7,13,905 విలువచేసే మద్యాన్ని ప్రత్యేక నిఘా బృందాలు పట్టుకున్నాయి
మండలం పురుషులు మహిళలు ఇతరులు
దుగ్గొండి 18,183 18,884 0
గీసుకొండ 13,979 14,928 1
నల్లబెల్లి 15,509 16,155 0
సంగెం 20,213 21,247 1
మొత్తం 67,884 71,214 2
గీసుకొండ మండలం గీసుకొండ, గంగదేవిపల్లి, దుగ్గొండి మండలం వెంకటాపూర్, దేశాయిపల్లి, నల్లబెల్లి మండలం నల్లబెల్లి ఉన్నత పాఠశాల, నందిగామ, సంగెం మండలం సంగెం ఉన్నత పాఠశాల, మొండ్రాయిలో హరిత (గ్రీన్ మోడల్) పోలింగ్ కేంద్రాలను అధికారులు శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఓటర్లను ఆకట్టుకునేలా వీటిని తీర్చిదిద్దారు.
సంగ్రామం
సంగ్రామం
సంగ్రామం
సంగ్రామం
సంగ్రామం


