నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
28 కేంద్రాల్లో ఎంట్రెన్స్
● మొత్తం 5,648 మందికి
4,383 మంది హాజరు
ఖిలా వరంగల్: మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతగా ముగిసింది. 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 5,648 మంది విద్యార్థులకు 4,383 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 89 శాతం విద్యార్థులు హాజరుకాగా 1,265 మంది గైర్హాజరయ్యారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పర్యవేక్షకురాలు, నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ పూర్ణిమ తెలిపారు. 80 సీట్లకు 4,383 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. పోలీసు బలగాలు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి. విద్యార్థులను గంటముందే పరీక్ష హాళ్లలోకి అనుమతించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినందుకు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


