బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్‌లో సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందిన సుదర్శన్‌రెడ్డి, రవీంద్రచారి, యాదగిరి, కృష్ణమూర్తి, అజీదుద్దీన్, ఉప్పలయ్య, సారంగపాణి, రాజేశ్వరి సీపీని శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అప్పగించిన పనులు సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు..
కేయూ పీజీ మూడో
సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం తదితర కోర్సుల (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) మూడో సెమిస్టర్ పరీక్షలు జనవరి 3వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 3న మొదటి పేపర్, 5న రెండో పేపర్, 7న మూడవ పేపర్, 9న నాలుగో పేపర్, 12న ఐదో పేపర్, 16న ఆరో పేపర్ పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.
క్రీస్తు దీవెనలు ఉండాలి
కాజీపేట రూరల్: సర్వమానవాళి రక్షకుడు యేసుక్రీస్తు దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఓరుగల్లు పీఠం పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్ అన్నారు. కాజీపేట ఫాతిమా కెథిడ్రల్ చర్చిలో శనివారం యేసు క్రీస్తు జయంతి 2025, జూబ్లీ వేడుకలు కనులపండువగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాలనాధికారి ఫాదర్ విజయపాల్ మాట్లాడుతూ.. రోమ్ పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ ఈ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో.. సంవత్సరం పీఠస్థాయిలో, విచారణ, గ్రామ స్థాయిలో ఈ ఉత్సవాలు నిర్వహించాలని ప్రకటించినట్లు తెలిపారు. ఈ జూబ్లీ వేడుకల్లో విశ్వాసులు ఏసుక్రీస్తు జన్మ రహస్యాన్ని ధ్యానిస్తూ జూబిలీ అంతరార్థాన్ని తెలుసుకోవాలన్నారు. ఫాదర్ విజయపాల్ పూజ బలిని సమర్పించి జూబిలీ సందేశాన్ని అందించి ప్రజల కోసం ప్రార్థించారు. కార్యక్రమంలో ఓరుగల్లు దైవాంకితులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హుండీలో నగదు అపహరణ
ఖానాపురం: ఆలయంలో నగదు అపహరించుకెళ్లిన సంఘటన శనివారం జరిగింది. ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని రామాలయంలో హుండీ ఉంది. అటువైపు వెళ్లిన గ్రామస్తులు సుబ్బారావు, మాధవరావుకు హుండీ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వెతకగా యాగశాల వద్ద హుండీ పగులగొట్టి ఉండడాన్ని గమనించారు. అందులో ఉన్న సుమారు రూ.2వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. రామాలయ చైర్మన్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గీత కార్మికుడికి
తీవ్ర గాయాలు
వర్ధన్నపేట: తాటిచెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారి పడడంతో గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఇల్లందలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బత్తిని రాజు శనివారం ఉదయం తాటి వనంలో కల్లు గీయడానికి వెళ్లాడు. తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. దీంతో అతడి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి గీతకార్మికులు రాజు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి 108లో తరలించారు. ఆస్పత్రిలో రాజు చికిత్స పొందుతున్నాడు.
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి


