వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్ల పరిశీలన
న్యూశాయంపేట: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నల్లబెల్లి, దుగ్గొండి, సంగెం, గీసుగొండ మండలాల్లోని 74 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో చేశారు. వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లను సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవితో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్యశారద శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకున్న సాంకేతిక ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ రోజున ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి రాంరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కల్పన, అధికారులు పాల్గొన్నారు.


