హలో..అన్నా! | - | Sakshi
Sakshi News home page

హలో..అన్నా!

Dec 6 2025 7:20 AM | Updated on Dec 6 2025 7:20 AM

హలో..

హలో..అన్నా!

సంగెం: హలో.. అన్న.. హలో..తమ్ముడూ.. అంటూ జీవనోపాధి కోసం వరంగల్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఉంటున్న వారికి అభ్యర్థులు ఫోన్లు చేసి పలకరిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికలకు కొద్ది సమయమే ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు వలస ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామంలోని ఓటర్ల జాబితాను వడబోస్తూ తమకు ఓటు వేసే వారెవరు, వేయనివారెవరు అనేదానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామం బయట ఉన్న వలస ఓటర్లపై దృష్టి సారిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారు అయినప్పటి నుంచి గ్రామంలో ఓటరు జాబితాలో ఉండి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడానికి నిత్యం ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నారు. అవసరమైన ప్రయాణ చార్జీలు, ఇతర ఖర్చులు భరించేందుకు సిద్ధమయ్యారు. తమకే ఓటు వేసేలా మాట కూడా తీసుకుంటున్నారు. మొదటి, రెండో విడత ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎక్కడలేని బంధుత్వాలు, ప్రేమలు ఒలకబోస్తున్నారు.

వలస ఓటర్లకు వల..

ఫోన్లు చేసి అప్యాయంగా పలకరింపులు

బంధుత్వాలను గుర్తు చేస్తున్న అభ్యర్థులు

గ్రామానికి వచ్చి ఓటేసి పోవాలని అభ్యర్థన

చార్జీలు, ఖర్చులు సమకూర్చుతామని హామీ

ప్రత్యేక ‘వ్యూహం’తో ముందుకు..

పంచాయతీ ఎన్నికల్లో పార్టీల నేతలు వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల రోజుకు ముందుగానే గ్రామాల వచ్చే విధంగా వారిని ఒప్పించడంలో గతంలో ఆయా గ్రామాల నేతలు సఫలమయ్యారు. అదేవిధంగా ఎన్నికల షెడ్యూలు వెలువడిన దగ్గర నుంచి నిత్యం ఉదయం సాయంత్రం వలస ఓటర్లతో అభ్యర్థులు పలకరింపులు మొదలుపెట్టారు. గ్రామాల్లో ఉన్న వారి తల్లిదండ్రుల వద్ద ఫోన్‌ నంబర్లు తీసుకుని వారిని ఓటింగ్‌కు గ్రామాలకు వచ్చే విధంగా పక్కాగా వ్యూహాలను రచించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్ల వద్దకు వెళ్లి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాలకు వచ్చి ఓటు వేయడానికి అవసరమైన రవాణా, ఇతర ఖర్చులు చెల్లించడానికి మాట ఇస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఇప్పటికే రైలు, బస్‌ టికెట్లు సైతం బుక్‌ చేసి పంపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఒక ఓటు చాలా విలువైనది కావడం, ఒక ఓటుతోనే గెలుపోటములు ముడిపడి ఉండడలంతో ప్రతీ ఓటుపై ప్రత్యేక శ్రద్ధతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సకల ప్రయత్నాలు సాగిస్తున్నారు.

హలో..అన్నా!1
1/1

హలో..అన్నా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement