
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట: రైతులు మక్కల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దిగుబడిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తక్కువ ఎరువులను వాడుతూ అధిక దిగుబడులు వచ్చే విధంగా శాసీ్త్రయ కోణంలో వ్యవసాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు ప్రక్రియ
సమర్థవంతంగా నిర్వహించాలి
నల్లబెల్లి: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని డీపీఎం(డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్) దాసు అన్నారు. స్థానిక మదర్ థెరిస్సా మండల సమాఖ్య కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కమిటీలకు నిర్వహణ మార్గద్శకాలపై బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు సన్న ధాన్యానికి (ఏ గ్రేడ్) క్వింటాకు రూ.2,389, దొడ్డు రకం ధాన్యానికి (సీ గ్రేడ్) రూ.2,369 ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని, ఐకేపీ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, మండల సమాఖ్య కోశాధికారి మౌనిక, నల్లబెల్లి, దుగ్గొండి ఏపీఎంలు కందిక రమేష్, ఈద రమేష్, సీసీలు యాకుబ్, సాంబయ్య, వెంకటేశ్, కవిత, సుజాత పాల్గొన్నారు.