
విధుల్లో నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్
వేలేరు: వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని కలెక్టర్ స్నేహ శబరీష్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పీచర గ్రామంలోని పల్లె దవాఖాన, గొల్లకిష్టంపల్లిలోని కేజీబీవీని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. మొదట పీహెచ్‌సీలో ఫార్మసీ, రికార్డులు పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీ పరిధిలో ఎన్ని సబ్‌సెంటర్లు ఉన్నాయని ఆరా తీశారు. హెల్త్ సబ్‌సెంటర్ గురించి ఆరోగ్య విస్తరణ అధికారిని అడుగగా ఆయన పీచరలోని పల్లె దవాఖానకు తీసుకెళ్లాడు. పల్లె దవాఖానకు ఎందుకు తీసుకువచ్చారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె దవాఖానలో డ్యూటీ డాక్టర్ ఎవరి అనుమతి అడిగి సెలవు పెట్టిందని ప్రశ్నించారు. ఇద్దరు ఏఎన్‌ఎంలు ఆలస్యంగా రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా చేస్తే మెమో జారీ చేసి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అనంతరం గొల్లకిష్టంపల్లిలోని కేజీబీవీని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. డైనింగ్ హాల్, భోజనం, కూరగాయలు, ఇతర సాకర్యాలు పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈఓ వాసంతి, తహసీల్దార్ హెచ్ కోమి, డాక్టర్ మేఘన, ఏఓ కవిత, ఎంపీఓ భాస్కర్, ఎంఈఓ చంద్రమౌళి ఉన్నారు.