
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
నడికూడ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. రాయపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం ఆమె సందర్శించారు. పాఠశాలల్లో మధ్యాహ భోజనం, లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన స్థాయిలను పరీక్షించారు. ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో మెనూచార్ట్, అంగన్‌వాడీ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచి, ఉత్తమ ఫలితాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, తహసీల్దార్ రాణి, ఎంఈఓ కె.హనుమంతరావు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.