
వర్షార్పణం..
జిల్లా వ్యాప్తంగా దంచికొట్టిన వాన
ఈ ఫొటోలో తడిసిన మొక్కజొన్నను ఆరబెడుతున్న యువరైతు రెడ్డి కృష్ణ. దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామం. వ్యవసాయ భూమి లేకపోవడంతో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఎకరం భూమిలో మొక్కజొన్న వేశాడు. పంట బాగానే వచ్చింది. కంకి తీసుకువచ్చి మిషన్‌లో వేసి జొన్నలు వేరు చేశాడు. ఒకరోజు పాటు జొన్నలను ఆరబోశాడు. అకస్మాత్తుగా సోమవారం తెల్లవారు జామునుంచి కురుస్తున్న వర్షానికి మొన్నజొన్నలు తడిసిపోయాయి. దీంతో ఆరు నెలల పాటు చేసిన కష్టం ఒక్కరాత్రి నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కౌలు డబ్బులు, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు.
సాక్షి, వరంగల్: జిల్లాలో సోమవారం తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు మండలాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లగా మిరప తోటల్లో నీరు నిలిచింది. చేతికొచ్చిన మొక్కజొన్న తడిసి పోయింది. నల్లబెల్లి, దుగ్గొండి, నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో భారీ వర్షం కురవగా, పర్వతగిరి, ఖానాపురం, నర్సంపేట, రాయపర్తి, వరంగల్‌లో మోస్తరు వర్షం కురిసింది. ఇతర మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మొత్తంగా జిల్లాలో 545.2 మిల్లీమీటర్ల వర్షం కురసింది. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న పంట తడవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మిరపతోటల్లో భారీగా నీరు నిలవడంతో ఆ పంటపై ఏమైన ప్రభావం చూపుతుందన్న ఆందోళన రైతుల్లో కనబడుతోంది. కొన్నిచోట్ల వరి పంట కూడా నేలకు ఒరిగిన పరిస్థితి ఉందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. అలాగే వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌లో ఆరబోసిన మొక్కజొన్నలు కొంతమేర తడిచినా.. వెంటనే అధికారులిచ్చిన టార్పాలిన్లతో రైతులు కప్పి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు.
ఎక్కడెక్కడ ఏం జరిగిందంటే..
● భారీ వర్షంతో నల్లబెల్లి నుంచి మహమ్మద్ గౌస్‌పల్లి ప్రధాన రహదారిపై ఉన్న నందిగామ, రేలకుంట వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
● దుగ్గొండి మండలంలో మిరపతోటల్లో నీరు నిలిచింది. మొక్కజొన్న కల్లాలు తడిశాయి. పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది. పంట చేతికి వచ్చే దశలో వర్షం పడడంతో దూది గింజ నాణ్యత తగ్గింది. కొన్నిచోట్ల దూది నేలపై పడింది. ఫలితంగా రైతులకు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కనబడడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.
● నెక్కొండ నుంచి కేసముద్రం వెళ్లే ప్రధాన రహదారి వెంకటాపురం చెరువు మత్తడి పోయడంతో లోలెవల్ బ్రిడ్జిపై వరదనీరు ప్రవాహం పెరిగి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గ్రామస్తులు సహకారంతో లోలెవల్ బ్రిడ్జి దాటించారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికెళ్లి పరిశీలించారు. అలాగే చంద్రుగొండ గ్రామానికి చెందిన దాసరి సంపత్‌కు చెందిన రెండు గేదెలపై పిడుగు పడడంతో మృత్యువాత పడ్డాయి.
● వరంగల్ నగరంలోనూ చాలా కాలనీల్లోని రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. రాత్రి సమయంలోనే వర్షం నీరు క్లియర్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పత్తి రైతులకు తీవ్ర నష్టం, మిరపతోటల్లో నిలిచిన వర్షపు నీరు
తడిసిన మొక్కజొన్న

వర్షార్పణం..

వర్షార్పణం..