
వర్షంతో రైతుల్లో ఆందోళన
హన్మకొండ: వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ఆకాశం మేఘావృతం కావడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంట చేతికి వచ్చి కల్లాల్లో ఆరబోయగా, వర్షానికి తడిసిముద్దయ్యాయి. ముందుగా నాటు వేసిన వరి పంట కోతకు వచ్చింది. చేతికి వచ్చిన వరి.. ఈదురు గాలులు, భారీ వర్షం కురిసిన చోట నేలవాలుతోంది. దీంతో నీటిలో తడిసి ధాన్యం గింజలు మొలకెత్తి నష్టం చేకూరుతోందని రైతులు మొత్తుకుంటున్నారు. సోమవారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి హనుమకొండ జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. కమలాపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు మండలంలో మోస్తరు వర్షం కురవగా.. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో 62.3 మిల్లీమీటర్లు, కమలాపూర్‌లో 43, ఆత్మకూరులో 31.5, దామెరలో 18.8, పులుకుర్తిలో 7.3, పరకాలలో 7, ఎల్కతుర్తిలో 6.3, ధర్మసాగర్‌లో 5.5, కాజీపేటలో 5, నడికూడలో 5, హసన్‌పర్తి చింతగట్టులో 5, శాయంపేటలో 4.5, హసన్‌పర్తి నాగారంలో 3.3, ఐనవోలు కొండపర్తిలో 2.5, మడికొండలో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.