
ఐనవోలు పీఎస్‌ను సందర్శించిన కేంద్ర పోలీస్ అధికారి
● వివిధ కోణాల్లో పరిశీలించి సంతృప్తి
ఐనవోలు: మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ దేశ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఉత్తమ పోలీస్ స్టేషన్లను గుర్తించి అవార్డులు, ప్రశంసపత్రాలు అందజేస్తుంది. అందులో భాగంగా 2025 గాను ప్రతీ రాష్ట్రంనుంచి మూడు, దేశ వ్యాప్తంగా 78 పోలీస్ స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేయగా అందులో ఐనవోలు పోలీస్ స్టేషన్ ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం హోంశాఖ ఆధీనంలోని ఎవాల్యుయేషన్ అధికారి సయ్యద్ మహ్మద్ హసన్ సోమవారం ఐనవోలు పోలీస్‌స్టేషన్‌ను ప్రత్యక్షంగా పరిశీలించారు. డాక్యుమెంటేషన్, రికార్డులు, ఇన్‌ఫ్రా, స్టేషన్ ప్రాంగణం, స్టాఫ్ ప్రవర్తన, ఇతరుల ఫీడ్‌బ్యాక్ తదితర అంశాలను స్వయంగా తెలుసుకున్నారు. పౌరులతో అధికారులు వ్యవహరిస్తున్న తీరును గమనించారు. డిపార్ట్‌మెంట్ పరంగా 19 పారామీటర్లపై పలు ప్రశ్నలు సందించి సమాధానాలు తెలుసుకున్నారు. 100 డయల్‌కు 2024లో 1,207 ఫిర్యాదులు రాగా అన్ని కాల్స్ అటెండ్ చేయడమే కాకుండా సగటున 4.08 నిమిషాల్లో ఘటనా స్థలానికి వెళ్లినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. స్టేషన్‌లో 840 సన్నిహిత పిటిషన్లు రాగా, అందులో 236 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 60 రోజుల్లోగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా 8 అవేర్‌నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలీస్ స్టేషన్‌ను ఆహ్లాద భరిత వాతావరణంలో కొనసాగిస్తూ వృద్ధులు, మహిళలు, చిన్నారుల, దివ్యాంగుల పట్ల మానవీయ కోణంలో వేగంగా స్పందించినట్లు తెలియజేశారు. ఈ సందర్బంగా ఎవాల్యుయేషన్ అధికారి సయ్యద్ మహ్మద్ హసన్ విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్త ఉత్తమ పోలీస్ స్టేషన్ ఎంపికలో భాగంగా సోమవారం ఐనవోలు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల అంశాలను క్షుణ్ణంగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. డిసెంబర్‌లో దేశ వ్యాప్త ఉత్తమ పోలీస్ స్టేషన్లను ప్రకటించనున్నట్లు చెప్పారు. ఐనవోలు పోలీస్‌స్టేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ, ఐపీఎస్ అధికారి అంకిత్ కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్, ఐనవోలు ఎస్‌హెచ్‌ఓ పస్తం శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.