
కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరం
● రూ.60,610 నగదు..
9 ఫోన్లు స్వాధీనం
● కార్పొరేటర్ భర్తతోపాటు 11మంది అరెస్ట్
● వారిలో ముగ్గురు మహిళలు
వరంగల్ క్రైం: హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి కనకదుర్గ కాలనీలో ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేసి 12మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు సోమవారం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. నగరానికి చెందిన ఓ కార్పొరేటర్ ఇంట్లో ఆదివారం పేకాట ఆడుతున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారంతో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. పేకాడుతూ 12 మంది పట్టుబడినట్లు తెలిపారు. వారినుంచి రూ.60,610 నగదు, 9 సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పట్టుబడిన వారిలో సిరిసిల్ల జిల్లా శాంతినగర్‌కు చెందిన ఇందిరియాల రాజేందర్, కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్‌కు చెందిన గడ్డం శ్రీనివాస్, హనుమకొండ వడ్డేపల్లికి చెందిన గీతం జితేందర్‌రెడ్డి, కనకదుర్గ కాలనీకి చెందిన వెల్దండి రమేశ్, హనుమాన్‌నగర్‌కు చెందిన ముస్కం ముత్తయ్య, కనకదర్గ కాలనీకి చెందిన గుజ్జుల మహేందర్‌రెడ్డి (కార్పొరేటర్ భర్త), వేముల శివాజీ, బాలసముద్రానికి చెందిన కల్వ రమ, వాణినగర్‌కు చెందిన పల్లె సుజాత, కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీకి చెందిన బీరం నీరజ, టీచర్స్ కాలనీకి చెందిన మడిశెట్టి భాస్కర్ ఉన్నారు. నిందితులను తదుపరి చర్యల కోసం సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. దాడిలో ఇన్‌స్పెక్టర్ రాజు, ఆర్‌ఎస్సై భానుప్రకాశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.