ఇక బోగస్‌ హాజరుకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ఇక బోగస్‌ హాజరుకు చెక్‌

Oct 12 2025 6:29 AM | Updated on Oct 12 2025 6:29 AM

ఇక బో

ఇక బోగస్‌ హాజరుకు చెక్‌

సంగెం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీల బోగస్‌ హాజరుకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కూలీలకు ఈ–కేవైసీ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ మస్టర్‌ పర్యవేక్షణ వ్యవస్థ (ఎన్‌ఎంఎంఎస్‌) యాప్‌లో కూలీల వివరాలు, ఈ–కేవైసీ నమోదు చేయడం తప్పనిసరి చేసింది. ఈ విధానంలో కూలీల జాబ్‌కార్డులకు ఆధార్‌ అనుసంధానం చేయడం, వారి ఐరిస్‌ నమోదుతో ఒకరికి బదులుగా మరొకరు పనికి వచ్చే అవకాశం ఉండదు. మృతుల పేర్లు నమోదు చేసే వీలుండదు. దీంతో ఎక్కువ మంది కూలీలు పనికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మస్టర్లు రాసే అవకాశం ఉండదు. జిల్లాలోని 11 గ్రామీణ మండలాల్లో ఉపాధి హామీ కూలీల ఈ–కేవైసీ నమోదు కొనసాగుతోంది. ఈ–కేవైసీ పూర్తి చేసుకోని కూలీలకు ఇక మీదట పనులు కల్పించే అవకాశం ఉండదు. అధికారులు అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. నూతన సంస్కరణలతో ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పెరుగుతుందని, ఒకరి జాబ్‌కార్డుపై మరొకరు పనిచేసే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 1,23,701 మంది కూలీలు..

జిల్లాలోని 325 గ్రామపంచాయతీల పరిధిలో 1.2 లక్షల జాబ్‌కార్డులు జారీచేయగా 2.39 లక్షల మంది కూలీలున్నారు. అందులో యాక్టివ్‌గా ఉన్న 74 లక్షల జాబ్‌కార్డుల్లో 1,23,701 మంది కూలీలు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 1,23,698 మంది కూలీలకు ఆధార్‌ జాబ్‌కార్డుకు అనుసంధానం, 77,111 మందికి (62.34 శాతం) ఈ–కేవైసీ పూర్తి అయ్యింది. ఇంకా 46,590 మందికి ఈ–కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది.

ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ తీసుకొచ్చిన కేంద్రం..

పనిప్రదేశం వద్ద కూలీల హాజరును నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసేవారు. కానీ, క్షేత్రసహాయకులు, మేట్లు నకిలీ ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయటపడడంతో వీటిని అరికట్టేందుకు కేంద్రం ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను తీసుకొచ్చింది. దీనిని దుర్వినియోగం చేస్తున్నట్లు గ్రహించి నకిలీల హాజరు నమోదును అరికట్టేందుకు ఈ–కేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ–కేవైసీ పూర్తి అయిన తర్వాత పనులకు వచ్చిన కూలీల ఫొటోలను ఫోన్‌లో తీసి అప్‌లోడ్‌ చేస్తారు. నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తారు. ఒకే వ్యక్తి రెండుసార్లు ఫొటో దిగి అప్‌లోడ్‌ చేయిస్తే కూలీల డబ్బులు విడుదల కావు.

అక్రమాలకు ఆస్కారం లేకుండా..

గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల వివరాల నమోదుకు ఈ–ఎంబీ (ఎలక్ట్రానిక్‌ మెజర్‌మెంట్‌ బుక్‌) విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. పనిచేసే ప్రాంతాల వివరాలను గుర్తించి ముందుగా లెక్కించి కొలత పుస్తకంలో రాసి తర్వాత ఆన్‌లైన్‌, ఈ ఎంబీలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను ప్రత్యేక యాప్‌తో అనుసంధానిస్తే ఆయా పనుల వివరాలను ఎప్పుడైనా చూసుకోవచ్చు. దీంతో ఒకే చోట రెండు పనులు చేయడం వంటి తప్పిదాలకు ఆస్కారం ఉండదు.

సాంకేతిక సమస్యతో ఆలస్యం..

జిల్లాలో ఈ–కేవైసీ ప్రక్రియ ప్రారంభమై దాదాపు పది రోజులు అవుతోంది. సిగ్నల్స్‌ అంతరాయం కారణంగా ఈ–కేవైసీ నమోదులో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని సమయాల్లో యాప్‌ మొరాయిస్తుండడంతో ఆలస్యం అవుతున్నది.

ఈ–కేవైసీ పూర్తికి చర్యలు..

అన్ని గ్రామాల్లో జాబ్‌కార్డు ఉన్న కూలీల వివరాలను ఈ–కేవైసీ చేయిస్తున్నాం. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు ఈ విధానం గురించి అవగాహన కల్పించాం. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అడిగినవారందరికీ పనులు కల్పిస్తాం. నకిలీ మస్టర్లకు తావులేకుండా అర్హులైన కూలీలందరికి 100 రోజుల పని కల్పించేందుకు కృషి చేస్తున్నాం.

– గణేశ్‌, ఏపీఓ, సంగెం

ఉపాధి హామీ జాబ్‌కార్డుతో ఆధార్‌ అనుసంధానం

పని ప్రదేశంలో కూలీలకు ఐరిస్‌ నమోదు

ఈ–కేవైసీ పూర్తికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు

ఇక బోగస్‌ హాజరుకు చెక్‌1
1/2

ఇక బోగస్‌ హాజరుకు చెక్‌

ఇక బోగస్‌ హాజరుకు చెక్‌2
2/2

ఇక బోగస్‌ హాజరుకు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement