
బీట్ ఆఫీసర్ సస్పెన్షన్
నల్లబెల్లి: మండలంలోని గోవిందాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శోభన్‌బాబును సస్పెండ్ చేస్తూ అటవీశాఖ జిల్లా అధికారి అనూజ్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు నర్సంపేట ఎఫ్‌ఆర్వో రవికిరణ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బీట్ ఆఫీసర్ శోభన్‌బాబు రైతుల నుంచి డబ్బులు తీసుకుని పోడు చేయిస్తున్నాడని ఫిర్యాదులు అందాయి. విచారణ చేయగా డబ్బులు తీసుకున్నట్లు పోడు రైతులు రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు విచారణ నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేసినట్లు ఎఫ్‌ఆర్వో రవికిరణ్ పేర్కొన్నారు.
రేపు ఉద్యోగమేళా
కాళోజీ సెంటర్: హనుమకొండ అంబేడ్కర్ సెంటర్ సమీపంలోని ఐసీఎస్‌ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో సోమవారం ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఒకేషనల్, ఏ గ్రూపు విద్యార్థులైనా 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, ఓవరాల్‌గా 60 శాతం గణితంలో మార్కులు సాధించినవారు అన్ని సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు హెచ్‌సీఎల్ ప్రతినిధి శివ (7569177071, 7981834205)ను సంప్రదించాలని డీఐఈఓ సూచించారు.
6.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
నర్సంపేట రూరల్: పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలోని రాజిరెడ్డి రైస్‌మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వచేశారన్న పక్కా సమాచారం అందింది. ఈ మేరకు వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు శనివారం సంయుక్తంగా దాడులు చేసి 6.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి మిల్లు యజమాని సాయిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. దాడుల్లో నర్సంపేట రూరల్ ఎస్సై గూడ అరుణ్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాలిక అదృశ్యం
నర్సంపేట రూరల్: బాలిక అదృశ్యమైన సంఘటన నర్సంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లారు. వారు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి బాలిక కనిపించలేదు. స్నేహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ మేరకు బాలిక తండ్రి శనివారం సాయంత్రం నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో చేశారు.
ఆటో టైరు అపహరణ
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ కీర్తినగర్‌లో ఆటో టైరును డిస్క్‌తో సహా దొంగలు ఎత్తుకుని వెళ్లారు. బాధితుడి కథనం ప్రకారం.. కీర్తినగర్‌కు చెందిన అనుమాండ్ల మహేశ్ ఈనెల 9న తన ఆటోను ఇంటిపక్కన నిలిపి నిద్రపోయాడు. తెల్లారి లేచి చూస్తే ఆటో వెనక టైరును డిస్క్‌తో సహా దొంగలు ఎత్తుకుపోయారని గుర్తించాడు. దీంతో తనకు రూ.4 వేల నష్టం వచ్చిందని, ఈ విషయాన్ని 112కు డయల్ చేసి చెప్పగా వారు కేసును గీసుకొండ పోలీసులకు అప్పగించారు.
జనరల్ సీట్లలో
బీసీలు పోటీ చేయాలి
నయీంనగర్: జనరల్ సీట్లన్నింట్లో బీసీలు పోటీ చేసి గెలవొచ్చని బీసీ నాయకులు ఉద్ఘాటించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో బీసీ చైతన్య వేదిక, ఆలిండియా ఓబీసీ జేఏసీ ఆధ్వర్యంలో ‘బీసీ రిజర్వేషన్లు – ఉద్యమ కార్యాచరణ’ అంశంపై శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో బీసీ చైతన్య వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఆలిండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్, జి.శ్రీనివాస్, సోమ రామమూర్తి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధనకు సబ్బండ వర్గాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బహుజనుల ఓట్లు బహుజనులకే వేసుకుందామని నినదించారు. బీసీ రిజర్వేషన్లకు ఎస్సీ, ఎస్టీల మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తాడిశెట్టి క్రాంతికుమార్, కుమార్ గాడ్గె, వీరస్వామి, వేణుమాధవ్, రామారావు, తిరుపతి, సంపత్, విద్యార్థులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.