
సాంకేతికతను రైతుకు చేరువ చేయాలి
● రైతు సదస్సులో కలెక్టర్ సత్యశారద
గీసుకొండ: వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఎలుకుర్తిహవేలిలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల రావెప్ విద్యార్థులు, వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రైతు సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రానున్న కాలంలో వ్యవసాయంలో చోటు చేసుకునే మార్పులకు అనుగుణంగా రైతును సన్నద్ధంచేయాలని సూచించారు. వ్యవసాయ సహపరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి మాట్లాడుతూ మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వేయవద్దని, యాంత్రీకరణ అలవర్చుకోవాలన్నారు. రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ వరి, పత్తిలో ఎండు తెగులు నివారణకు సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ మాట్లాడుతూ పత్తి రైతులు తప్పనిసరిగా ‘కపాస్ కిసాన్ యాప్’లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రపంచ ఎగ్‌డే ఉత్సవాలు కూడా నిర్వహించారు. వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బీవీ రాజ్‌కుమార్, విశ్వతేజ, రమేశ్, జె.నరేందర్, గోపిక, ప్రజ్ఞ, సాయికిరణ్, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఏఓ హరిప్రసాద్‌బాబు, అభ్యుదయ రైతులు, ఏఈఓలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మార్కెట్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి
వరంగల్: పత్తి సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నాణ్యతా ప్రమాణాల ప్రకారం మద్దతు ధరలకు విక్రయించేలా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఒక హెల్ప్‌డెస్క్ వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద మార్కెట్ అధికారులను ఆదేశించారు. మార్కెట్‌ను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, యార్డుల్లోని పంట ఉత్పత్తులు పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్‌లో రైతులు, వ్యాపారులు, కార్మికులకు కనీన వసతులు కల్పించేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ, గ్రేడ్–2 కార్యదర్శులు ఎస్.రాము, జి.అంజిత్‌రావు, సహాయ కార్యదర్శి జి.రాజేందర్, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, కోశాధికారి అల్లె సంపత్, కార్యవర్గ సభ్యులు గౌరిశెట్టి శ్రీనివాస్, కాటన్ సెక్షన్ కార్యదర్శి కట్కూరి నాగభూషణం పాల్గొన్నారు.
ధాన్యం సేకరణలో
ఇబ్బందులు రావొద్దు
న్యూశాయంపేట: రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్‌లో దాదాపు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి 266 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో కంటే 65 కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా పెంచినట్లు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీసీఓ నీరజ, డీసీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ, ఆర్టీఓ శోభన్, లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, కోశాధికారి ఇరుకు కోటేశ్వర్‌రావు, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సాంకేతికతను రైతుకు చేరువ చేయాలి