
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలి
● బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్
నర్సంపేట: అగ్రకులాల నాయకుల కుట్రలో భాగంగానే తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే విధించిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ డ్యాగల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నర్సంపేటలోని అమరవీరుల జంక్షన్ వద్ద శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపిందని తెలిపారు. రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసే విధంగా బిల్లు కేంద్రానికి పంపినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును పార్లమెంట్‌లో చర్చించకుండా నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల జీఓ 9ని రద్దు చేయాలని రెడ్డి జాగృతి నాయకులు పిటిషన్ వేయడంతో హైకోర్టు స్టే విధించడం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేక కుట్ర జరిగిందని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు పోరాడాలని సూచించారు. పార్టీల జెండాలను పక్కన పెట్టి జిల్లా వ్యాప్తంగా పోరాటం చేసి రిజర్వేషన్లను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేశ్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేశ్, బీసీ జిల్లా నాయకులు డ్యాగల శివాజీ, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యాంకుమార్, పట్టణ కార్యదర్శులు గాండ్ల శ్రీని వాస్, బేతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.