
దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
కమలాపూర్: సాదాబైనామాకు సంబంధించిన దరఖాస్తులతో పాటు రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులు, కార్యాలయాన్ని పరిశీలించి మండలంలోని ప్రభుత్వ భూముల వివరాలు అడిగి తెలుసుకునిన్నారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
వితంతువుకు అండగా నిలిచిన పీఏసీస్ డైరెక్టర్
మండలంలోని వంగపల్లికి చెందిన వితంతువు జూపాక ఇందిరకు పీఏసీఎస్ డైరెక్టర్, బీఆర్‌ఎస్ నాయకుడు తక్కళ్లపెల్లి సత్యనారాయణరావు అండగా నిలిచారు. ఇందిర భర్త జలందర్‌కు రావాల్సిన వారసత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఒకరు 2018లో ఆర్‌ఓఆర్ ద్వారా పట్టా చేసుకోగా.. ఈ విషయమై ఇందిర అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తన భూమి తనకు ఇప్పించండని ఇందిర విలపిస్తుండగా.. గమనించిన సత్యనారాయణరావు చలించిపోయారు. మాజీ సర్పంచ్ శనిగరపు సమ్మయ్యతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీకి వచ్చిన అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి వద్దకు ఇందిరను తీసుకెళ్లి విషయాన్ని అదనపు కలెక్టర్‌కు వివరించారు. స్పందించిన అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని, బా ధ్యులపై చర్యలు చేపట్టి అక్రమ పట్టా రద్దు చేయాలని ఆదేశించారు. తనకు అండగా నిలిచిన సత్యనారాయణరావుకు ఇందిర కృతజ్ఞతలు తెలిపారు.