
పోషకాహారంతోనే ఆరోగ్యమైన సంతానం
● జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి
శాయంపేట: గర్భిణులు పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతారని జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పరకాల సీడీపీఓ స్వాతి అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి జాతీయ పోషణ మాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి జయంతి పాల్గొని మాట్లాడారు. ప్రతీ సంవత్సరం పోషణ మాసం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆరోగ్యలక్ష్మి, ప్రీస్కూల్, లోప పోషణతో బాధపడే పిల్ల ల పోషణ స్థితిని మెరుగుపర్చే సేవలను లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఫణిచంద్ర, మండల వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ, వైద్యులు విద్య, శోభ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు సునీత, పుణ్యవతి, పోషణ్ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ కళ్యాణి, బ్లాక్ కో–ఆర్డినేటర్ భిక్షపతి, అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు.