
ఆర్టీఐని పకడ్బందీగా అమలు చేయాలి
పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ
పరకాల: ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం–2005 అమలు కోసం కార్యాలయ ఉద్యోగులంతా పారదర్శకంగా వ్యవహరించాలని పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ కోరారు. సమాచార హక్కు చట్టం – 2005 వారోత్సవాల్లో భాగంగా పరకాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జవాబుదారీతనంతో ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆర్టీఐ చట్టం ద్వారా కోరిన సమచారాన్ని పారదర్శకంగా అందించాలని కోరారు. జవాబు దారీగా వ్యవహరించినప్పుడే ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి అనుమానాలు రావని, పాలనలో పారదర్శకత ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్డీఓ డాక్టర్ నారాయణ
దామెర: సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని పరకాల ఆర్డీఓ డాక్టర్ కె. నారాయణ అన్నారు. మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. దరఖాస్తుల పరిశీలనలో అలసత్వం వహిస్తే సహించేదిలేదన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం చేయాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ జ్యోతిలక్ష్మీదేవి, నాయబ్ తహసీల్దార్ ఖురేషి, ఆర్‌ఐలు సంపత్, భాస్కర్ రెడ్డి, జీపీఓలు పాల్గొన్నారు.
ఢిల్లీ సదస్సులో మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: అరైస్ సిటీకి అనుగుణంగా వరంగల్ నగరంలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. న్యూఢిల్లీలో ఇక్లీ సౌత్ ఏసియా సంస్థ 20 వసంతాలు పూర్తి చేసుకున్నందున, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ (ఎన్‌ఐయూఏ) సంయుక్తంగా అరైస్ సిటీస్‌పై సదస్సు నిర్వహించారు. బుధ, గురువారాల్లో వివిధ ప్రాంతాల నుంచి 200 మంది డెలిగేట్స్ వేదికపై హాజరవ్వగా.. ఇందులో మేయర్ మాట్లాడుతూ.. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, హుజూరాబాద్ వద్ద రూ.150 కోట్ల వ్యయంతో 25 ఎకరాల స్థలంలో 6 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. వరంగల్ నగరాన్ని విశ్లేషించి అందుకు తగినట్లుగా అడాప్టివ్ మెజర్స్, స్ట్రక్చరల్ మెజర్స్, నాన్ స్ట్రక్చరల్ మెజర్స్‌గా విభజించినట్లు తెలిపారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశామని, ప్రకృతి సిద్ధమైన పరిష్కారాలను అవలంబిస్తున్నట్లు తెలిపారు. పదిశాతం గ్రీన్ బడ్జెట్‌తో పచ్చదనం కోసం మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు.

ఆర్టీఐని పకడ్బందీగా అమలు చేయాలి