
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి
న్యూశాయంపేట: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డితో కలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. ఆర్‌ఓ విధులు, బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రతీ మండలంలో మూడు లేదా నాలుగు ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారి, ప్రతీ జెడ్పీటీసీకు రిటర్నింగ్ అధికారిని నియమించామన్నారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణ నియమావళి ప్రకారం ఎన్నికల నోటీసు ఇవ్వాలని, నామినేషన్ల స్వీకరణ, రిటర్నింగ్ అధికారి కార్యాలయం నోటీసు బోర్డుపై స్వీకరించిన అభ్యర్థుల నామినేషన్ పత్రాల జాబితా, స్వీయ ప్రకటన ప్రతులను ప్రచురించాలని, నామినేషన్ పత్రాల పరిశీలన, తిరస్కరించినట్లయితే దానికి గల కారణం తెలపాలని, నామినేషన్ పత్రాల జాబితా ప్రచురించాలని, అభ్యర్థుల ఉపసంహరణ నోటీసు స్వీకరించాలని, పోటీ చేయు జాబితా, గుర్తులు కేటాయింపు, బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నారు. ప్రతిరోజు పీపుల్ సాఫ్ట్‌వేర్‌లో ఆర్‌ఓలు నివేదికలను ఎలక్షన్ ప్రాసెస్ మోడల్‌ను ఉంచాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.