
ఆర్థిక భరోసా ఏది?
నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న కులాంతర వివాహం చేసుకున్న జంటలు
ఉమ్మడి జిల్లాలో
పెండింగ్ దరఖాస్తులు
జిల్లా దరఖాస్తులు
వరంగల్ 148
హనుమకొండ 133
జనగామ 180
మహబూబాబాద్ 139
ములుగు 97
భూపాలపల్లి 93
మొత్తం 790
సాక్షి, వరంగల్: ఆదర్శ వివాహం చేసుకున్న దంపతులకు రావాల్సిన ఆర్థిక భరోసా నాలుగేళ్లుగా రాకపోవడంతో కులాంతర వివాహం చేసుకున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2021 మే నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 790 జంటలకు సహాయం అందకపోవడంతో ఎప్పుడెప్పు డూ వస్తుందా.. అని నిరీక్షిస్తున్నారు. జిల్లాల షెడ్యూ ల్డ్ కులాల అభివృద్ధి అధికారుల కార్యాలయానికి వారు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అర్హులైన ప్రతిఒక్కరికి రూ.2.50 లక్షల బాండ్‌ను దంపతుల జాయింట్ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తూ వారి ఉపాధికి బాటలు వేసేలా చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇంకోవైపు ఈ పథకానికి సంబంధించి అధికారులు సరైన అవగాహన కలిగించకపోవడంతో చాలా మంది ఆర్థిక ప్రోత్సాహానికి దరఖాస్తు చేయడం లేదనే విమర్శలున్నాయి. అయితే కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక భరోసా అందిస్తున్నా.. తెలియక చాలా మంది దూరంగా ఉండిపోతున్నారు..
నిధులు వస్తేనే..
కొన్నేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్న వారికి ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా రూ.10 వేలు అందించేవారు. ఆ తర్వాత నగదును రూ.50 వేలకు పెంచారు. 2019 నుంచి ఆ మొత్తాన్ని ఏకంగా రూ.2.50 లక్షలకు పెంచి బాండ్ రూపంలో దంపతులకు అందిస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని దంపతుల ఉమ్మడి ఖాతాలో మూడేళ్లపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. మూడేళ్ల తర్వాత నగదును తీసుకొని ఆర్థికంగా ఎదగడానికి వారు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఆర్థిక భరోసా అందాలంటే దంపతుల్లో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ వర్గం, మరొకరు ఇతర వర్గానికి చెందినవారై ఉండాలి. అలాగే వివాహమైన జంట వార్షిక ఆదాయం రూ.ఐదు లక్షల కన్నా తక్కువగా ఉండాలి. వివాహ ధ్రువీకరణ పత్రం, దంపతుల ఫొటోలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, దంపతుల బ్యాంక్ జాయింట్ అకౌంట్, ఆధార్, రేషన్ కార్డు తదితర వివరాలతో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పిస్తే వాటిని పరిశీలించి అర్హులైన జంటలను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికై న జంటలు 2021 మే నుంచి ఎదురుచూస్తున్నారు. ‘మాకు 2022లో కులాంతర వివాహం జరిగింది. ఈ పథకానికి అవసరమైన అన్నీ పత్రాలు సమర్పించాం. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు మాకు ఆర్థిక భరోసా అందలేద’ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆదర్శ వివాహం ఆర్థిక భరోసా విషయమై వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మీని సంప్రదిస్తే...ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాలి. అవీ విడుదల కాగానే దరఖాస్తు చేసిన జంటల్లో అర్హులైన వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ అందజేస్తామని సమాధానమిచ్చారు.
రూ.2.50 లక్షల బాండ్‌ను డిపాజిట్ చేయడం ద్వారా ఉపాధివైపు ప్రేరణ
ఆదర్శ వివాహాలను
ప్రోత్సహించేందుకు చర్యలు
నిధులు లేకపోవడంతో
నీరుగారిపోతున్న ప్రభుత్వ లక్ష్యాలు
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు

ఆర్థిక భరోసా ఏది?

ఆర్థిక భరోసా ఏది?