
దొంగల హల్‌చల్ !
సంగెం: సంగెం, గీసుకొండ మండలాల్లోని తండాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రి మూడు తండాల పరిధిలోని ఏడు ఇళ్లల్లో చోరీకి పాల్ప డ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో పోచమ్మతండా శివారు రేఖియానాయక్‌తండాలోని బానోత్ అంబాలి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని వస్తువులు చిందర చేసి సూట్ కేసు తీసుకెళ్తుండగా మేలుక వచ్చిన అంబాలి గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపులు విని పక్క ఇంటిలోని మాలోత్ రాజేందర్ కుంటుంబసభ్యులు కూడా మేల్కోని అరవడంతో పత్తిచేనులో సూట్‌కేసును వదిలి పారిపోయారు. ఇంతలో మాలోత్ రాజేందర్ పాత ఇంటిలోంచి కూడా మరో ఇద్దరు దుండగులు పారిపోతుండటాన్ని గమనించారు. ఇంట్లోని రూ.9వేల విలువైన సెల్‌ఫోన్‌ను దొంగించుకునిపోయారు. వారి ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశారు. రెండిళ్లల్లో బంగారం, వెండి, నగదు చోరీకి గురికాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
గీసుకొండలో..
గీసుకొండ మండలంలోని విశ్వనాథపురం, సింగ్యా తండాల్లోని బాదావత్ దేవ్‌సింగ్, వాంకుడోత్ రవీందర్, అక్కినపల్లి ప్రదీప్, భూక్య భిక్షపతి ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం, వెండి, నగదును చోరీ చేశారు. దొంగిలించబడిన బంగారం, వెండి, నగదు విలువ రూ.1,69,690లు ఉంటుందని గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు. కాగా దొంగలు ఓ వ్యక్తిని గాయపరిచారు. ఒకే రాత్రి మూ డు తండాల్లోని ఏడు ఇళ్లల్లో చోరీకి పాల్పడడంతో ఆయా తండాలతో పాటుగా పరిసర తండావాసులు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. పోలీ సులు గస్తీ పెంచాలని కోరుతున్నారు.
తండాలను సందర్శించిన
ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్
చోరీ జరిగిన విశ్వనాథపురం, సింగ్యా తండా, రేఖియానాయక్ తండాలను వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి, గీసుకొండ సీఐలు రాజగోపాల్, మహేందర్, సంగెం ఎస్సై నరేష్ సిబ్బందితో కలిసి దొంగతనం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీం, జాగిలాలతో చోరీ జరిగిన ఇళ్ల పరిసర ప్రాంతాల్లో వేలిముద్రలు, ఇతర అనవాళ్లు సేకరించారు.
పండుగలకు ఊరు వెళ్తే జాగ్రత్త..
పండుగలకు ఊరు వెళ్లేవారు విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును వెంట తీసుకుని వెళ్లాలని లేదంటే ఇతర ప్రదేశాల్లో భద్రంగా దాచుకోవాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఒకే రాత్రి మూడు తండాల్లోని ఏడు ఇళ్లలో చోరీ

దొంగల హల్‌చల్ !