
వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
హన్మకొండ/కాజీపేట రూరల్: వరంగల్ మహానగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని దిల్‌కుశ్ అతిథి గృహంలో బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని జిల్లాకు చెందిన విశ్రాంత పోస్టల్ ఉద్యోగులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ భూనిర్వాసితులు కలిశారు. వరంగల్‌కు కేంద్ర ప్రభుత్వం వెల్‌నెస్ సెంటర్ మంజూరు చేసినందుకు విశ్రాంత పోస్టల్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని రైతులు వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని, వెల్‌నెస్ సెంటర్ సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని విశ్రాంత ఉద్యోగులకు హామీ ఇచ్చారు. త్వరలో కాజీపేట రైల్వే పరంగా శుభవార్త తెలుపుతామని మంత్రి అన్నారని రైల్వే జేఏసీ కన్వీనర్ రాఘవేందర్ తెలిపారు. కార్యక్రమంలో పోస్టల్ శాఖ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు తుమ్మ నరోత్తంరెడ్డి, సముద్రాల చక్రధర్‌రావు, చాడ జై హింద్‌రెడ్డి, పత్తి లింగారెడ్డి, కె.సాయిలు, తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్ కొండ్ర నర్సింగరావు, వైస్ చైర్మన్ అనుమాల శ్రీనివాస్, కోకన్వీనర్ కేతిరి సాయిరాజ్, అయోధ్యపురం మాజీ సర్పంచ్ గాదం యాదగిరి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఏసోబు, ఎం.రాజయ్య, ఎం.మల్లయ్య, ఇ.ప్రదీప్, ఎం.భిక్షపతి, ఎలగం వీరయ్య, జీవీ కుమార్, కె.కమల్, ఇ.శ్రీనివాస్, ఎస్.కిరణ్, యు.చిన్నరాజు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన విశ్రాంత పోస్టల్ ఉద్యోగులు, అయోధ్యపురం భూనిర్వాసితులు