
ఉదయాన్నే మైదానాల బాట
రోజూ మైదానంలో గంట గడిపితే.. హాస్పిటల్‌కు చికిత్స కోసం వెళ్లాల్సిన అవసరం రాదని చెబుతున్నారు వైద్యులు. శారీరక శ్రమే కాదు. అలసిన శరీరానికి అందించే ఆహారం సైతం ముఖ్యమంటున్నారు గ్రేటర్ వరంగల్ నగరవాసులు. మైదానంలో చెమటలు కక్కించిన అనంతరం డైట్‌ఫుడ్స్‌తో శక్తిని పొందుతున్నారు. మైదానాల ఎదుట లభిస్తున్న వైరెటీ డైట్ ఫుడ్స్‌పై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – కాజీపేట అర్బన్
● వాకింగ్, జాగింగ్,
డైట్‌ఫుడ్స్‌తో ఆరోగ్య వేట
● చెమటలు కక్కిస్తున్న
నగరవాసులు
మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది పిన్న వయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ కమాన్ అయిపోయాయి. లక్షలు ఖర్చు పెట్టే బదులు తక్కువ ఖర్చుతో ప్రకృతి ఒడిలో లభించే పండ్లు, ఆకుకూరల రసాలతో పాటు మిల్లెట్స్ బ్రేక్‌ఫాస్ట్‌లతో అనారోగ్యాలకు బ్రేక్ చెబుతున్నారు. నగరవాసులు ఉదయాన్నే నిద్రలేచి నడక కోసం మైదానాల బాట పడుతున్నారు. వాకింగ్, జాగింగ్‌తో కుస్తీ పడుతూ.. డైట్‌ఫుడ్స్‌తో సంపూర్ణ ఆరోగ్య జీవనం కోసం లైఫ్‌స్టైల్‌ను మార్చుకుంటున్నారు.
సంపూర్ణ ఆరోగ్యానికి జ్యూస్‌లు
ఆయా స్టాళ్లలో లభించే గోధుమ గడ్డి జ్యూస్‌తో ఇమ్యూనిటీ పెరుగుతుంది. క్యాన్సర్ రాకుండా పోరాడుతుంది. బూడిద గుమ్మడి కాయ జ్యూస్‌తో హార్ట్ ఎటాక్ రాకుండా, ఒబేసిటీ అదుపులో ఉంటుంది. అల్సర్ మటుమాయమవుతుంది. సోరకాయ జ్యూస్‌తో బరువు తగ్గడం, యూరిన్ ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. బీట్ రూట్ జ్యూస్‌తో బీపీ కంట్రోల్, క్యారెట్ జ్యూస్‌తో కంటి చూపు మెరుగుపడుతుంది. పుచ్చకాయ జ్యూస్‌తో ఒంట్లో వేడి తగ్గుతుంది. బరువు తగ్గడానికి ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది. కీర జ్యూస్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది.
ఆరోగ్య ఆహారం
నగరంలోని పబ్లిక్‌గార్డెన్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, జేఎన్‌ఎస్ గ్రౌండ్స్, ఖిలావరంగల్ మైదానాలకు వచ్చే వాకర్స్, నగరవాసులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డైట్ ఫుడ్స్‌పై దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా మైదానాల ఎదుట డైట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పడ్డాయి. వీటిలో రాగి జావా, ఆకుకూరల జ్యూస్, మిల్లెట్స్, కూరగాయల జ్యూస్, చద్దన్నం.. సీజన్‌ను బట్టి అంబలి, మజ్జిగ విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇవి కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తుండడంతో ఆరోగ్యాభిలాషులు మక్కువ చూపుతున్నారు.
వండర్ ఫుడ్.. మిల్లెట్స్
నరాల శక్తికి కొర్రలు, డయాబెటిక్, రోగనిరోధశక్తికి అరికలు, లివర్, కిడ్నీ, కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఊదలు, సంతానలేమి సమస్య నివారణకు సామలు, వీటితో పాటు ఉదయాన్నే గ్రామీణ ప్రాంతాలకు పరిమితమైన చద్దనాన్ని సైతం నగరంలో విక్రయిస్తున్నారు.

ఉదయాన్నే మైదానాల బాట