
పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
దుగ్గొండి: మండలంలోని పలు గ్రామాల్లో పత్తి, పసుపు, వరి పంటలను వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం శనివారం పరిశీలించింది. ఈ మేరకు తెగుళ్లు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వరంగల్ ఏరువాక కోఆర్డినేటర్ విజయభాస్కర్, శాస్త్రవేత్తలు రాజుకుమార్, వీరన్న, మాధవి వివరించారు. పత్తిలో వడలు తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాఫర్ ఆక్సీక్లోరైడ్ కలిపి మొక్క మొదలు వద్ద పోయాలని సూచించారు. కాయకుళ్ల నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్, స్ట్రెప్టోసైక్లిన్ మందు కలిపి పిచికారీ చేయాలన్నారు. గులాబిరంగు పురుగు నివారణకు ఎకరాకు 8 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పసుపు పంటలో నీరు నిల్వకుండా చూసుకోవాలని, మెటాలిక్సిల్ మందు లీటరు నీటికి 2.5 గ్రాములు కలిపి వేరు తడిసేలా పోయాలన్నారు. దుంప ఈగ నివారణకు ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలు చల్లుకోవాలని, సూక్ష్మ పోషక పదార్థాల లోపం నివారణకు ఫార్ములా 4, లేదా ఫార్ములా 6 మందు పిచికారి చేసుకోవాలని, పొటాష్ లోపనివారణ కోసం 13–0–45 మందు లీటరు నీటికి 10 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని వివరించారు. సస్యరక్షణ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే పంట చేతికి అందకుండా పోతుందని హెచ్చరించారు. ఏఓ మాధవి, ఏఈఓ విజయ్‌నాయక్, రైతులు కన్నెబోయిన సమ్మయ్య, బోళ్ల రవి, ప్రశాంత్, యార మల్లారెడ్డి, చెన్నూరి అచ్చిరెడ్డి, సాంబరాజు పాల్గొన్నారు.