
జూ పార్కులో సఫారీ
న్యూశాయంపేట: ఆగ్రా తరహాలో వరంగల్ కాకతీయ జూలాజికల్ పార్కులో ఎలుగుబంట్ల రెస్క్యూ సెంటర్ (సఫారీ) ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు, డైరెక్టర్ ఆఫ్ జూపార్క్స్ డాక్టర్ సునీల్ హియర్‌మత్ హైదరాబాద్ నుంచి వచ్చి ఐదురోజుల క్రితం వరంగల్ జూ పార్కును సందర్శించారు. సఫారీ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కేంద్రం ఏర్పాటుతో ఎలుగుబంట్లకు సరైన వైద్యం, ఆహారం, సంరక్షణ అందించి తిరిగి అడవుల్లో వదిలేయనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
సెంటర్ లక్ష్యం..
తీవ్రగాయాల కారణంగా కొన్ని ఎలుగుబంట్లు అడవిలో బతకలేని పరిస్థితి ఉంటుంది. వాటిని రెస్క్యూ సెంటర్‌కు తీసుకొచ్చి సంరక్షిస్తారు. సెంటర్‌లో వాటికోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎలుగుబంట్లు జీవించేందుకు పద్మాక్షి గుట్టను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేంద్రంలో వాటికోసం ప్రత్యేకంగా పెద్ద ఎన్‌క్లోజర్స్‌లు (చుట్టూ కంచెలు ఉన్న ప్రదేశాలు) ఉంటాయి. ఈత కొలనులు, చెట్లు, గుహలు, సహజ వాతావరణాన్ని ప్రతిబింబించే ఏర్పాట్లు చేయనున్నారు. అడవుల్లో బతికే సామర్థ్యం ఉన్నవాటిని తిరిగి అడవుల్లోకి విడిచిపెడతారు. బతకలేని వాటిని ఈసెంటర్‌లోనే శాశ్వతంగా ఉంచి సంరక్షిస్తారు. ఈ రెస్క్యూ సెంటర్ ఏర్పాటుతో వరంగల్ జూ పార్కు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా మారనుంది. దీని వల్ల వన్యప్రాణుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పర్యాటకులు వన్యప్రాణుల జీవితాన్ని దగ్గరగా చూసే వీలుంటుంది. ఈ మేరకు ఆగ్రా రెస్క్యూ సెంటర్ నిర్వహించే అధికారులు త్వరలో వరంగల్ జూపార్కును సందర్శించి, సఫారీ ఏర్పాటుకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారని అధికారులు తెలిపారు.
ఎలుగుబంట్ల రెస్క్యూ సెంటర్
ఏర్పాటుకు సన్నాహాలు
పరిశీలించిన అటవీశాఖ
ఉన్నతాధికారులు

జూ పార్కులో సఫారీ

జూ పార్కులో సఫారీ