
న్యాయ సలహాల కోసమే లీగల్ సర్వీస్ సెంటర్లు
జిల్లా జడ్జి పట్టాభి రామారావు
శాయంపేట: న్యాయ సలహాల కోసమే లీగల్ సర్వీస్ సెంటర్లు దోహదపడుతాయని జిల్లా జడ్జి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ పట్టాభి రామారావు అన్నారు. మండలంలోని తహరాపూర్, కొప్పుల గ్రామాల్లో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ సెంటర్లను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. లీగల్ సర్వీస్ సెంటర్లలో పారాలీగల్ వలంటీర్లు ఉంటారని, వారికి సమస్యలు పరిష్కరించడానికి శిక్షణ ఇస్తామని తెలిపారు. బుధవారం, శుక్రవారం వారు సర్వీస్ సెంటర్లకు వస్తారని చెప్పారు. లా కు సంబంధించిన సమస్యలు చెప్పుకోవచ్చని, ఉచితంగా ప్రభుత్వం తరఫున లాయర్‌ను నియమించి వారి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. లీగల్ సర్వీస్ సెంటర్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్‌పాండే, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శరత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భద్రయ్య, పరకాల ఏసీపీ సతీశ్‌బాబు, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ ఫణిచంద్ర, ఏఓ గంగాజమున, ఎంపీఓ రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
కమలాపూర్: గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ హరికిషన్, ఎంపీడీఓ గుండె బాబు లబ్ధిదారులను కోరారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తయ్యాక యాప్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత రూ.లక్ష, ఇంటి గోడల నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష, స్లాబ్ నిర్మాణం పూర్తయ్యాక రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. అదేవిధంగా కమలాపూర్, గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను నిరుపేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం త్వరలో కేటాయిస్తామని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ తౌటం ఝాన్సీరాణి, గృహ నిర్మాణ శాఖ డీఈ రవీందర్, ఏఈ హరిహరన్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఐనవోలు: మండల కేంద్రంలోని ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రవాస భారతీయులు సరాబు మోహన్–లలిత దంపతులు నిర్మించిన భ్రమరాంబికాదేవి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ కందుల సుధాకర్, ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవదుర్గ అలంకారాలు, ఉపనిషత్, చండీ సప్తశతి పారాయణాలు, శ్రీచక్రార్చన, చండీ హవనంతోపాటు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 22న శైలపుత్రి అలంకారం, 23న బ్రహ్మచారిణిగా, 24న చంద్రఘంటా, 25న కూష్మాండ దుర్గ, 26న స్కంధమాత, 27న కాత్యాయనీగా, 28న కాళరాత్రిగా, 29న మహాదుర్గగా, 30న సిద్ధి ధాత్రిగా, అక్టోబర్ 2న భ్రమరాంబిక దర్శనం ఉంటుందని చెప్పారు.

న్యాయ సలహాల కోసమే లీగల్ సర్వీస్ సెంటర్లు

న్యాయ సలహాల కోసమే లీగల్ సర్వీస్ సెంటర్లు